అప్పుడు ఎన్‌కౌంటర్‌, ఇపుడు బిడ్డ దత్తత

3 Feb, 2020 13:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నేరస్థుడి  బిడ్డను దత్తత తీసుకోనున్న ఐజీ మోహిత్ అగర్వాల్ 

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోనిఫరూకాబాద్‌లో పోలీసు అధికారి మానవత్వానికి పరిమళాన్ని అద్దారు. తండ్రి చేసిన నేరానికి అనాథగా మిగిలిన ఆడబిడ్డను ఆదుకునేందుకు చొరవ చూపారు. తన కూతురు పుట్టిన రోజంటూ ఇంటికి పిలిచి 23 మంది చిన్నారులను బంధించిన  ఉన్మాది సుభాష్‌ బాథమ్‌ కుమార్తె గౌరి (1)ని దత్తత తీసుకునేందుకు కాన్పూర్ రేంజ్ ఐజీ మోహిత్ అగర్వాల్  ముందుకొచ్చారు.

చట్టపరమైన అన్ని లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత కాన్పూర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ మోహిత్ అగర్వాల్  అధికారికంగా గౌరిని దత్తత తీసుకోనున్నారు. అంతేకాదు  ఆ  పాప బాగా చదువుకొని ఐపీఎస్‌ స్థాయికి రావాలని  ఆకాంక్షిస్తున్నారు.  గౌరీ స్వతంత్రంగా మారే వరకు విద్య, ఇతర ఖర్చులను తామే భరిస్తామని, ఆమె ఎదిగి ఐపీఎస్ ఆఫీసర్ కావాలని కోరుకుంటున్నానని మోహిత్ అగర్వాల్   తెలిపారు.. ఆమెను తన స్వంత పర్యవేక్షణలో జాగ్రత్తగా  చూసుకుంటామని హామీ ఇచ్చారు. గౌరీ ప్రస్తుతం పోలీసులు పర్యవేక్షణలో ఫరూఖాబాద్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 

కాగా ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలోని ముహమ్మదాబాద్ పట్టణంలోని కార్తియా గ్రామానికి చెందిన సుభాష్‌ బాథమ్‌..హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తూ..ఇటీవల బెయిల్‌మీద విడుదలయ్యాడు. ఇతనిపై ఇతర క్రిమినల్‌ కేసులు కూడా ఉన్నాయి. అయితే తనను జైలుకు పంపించారన్న ఆగ్రహంతో ఊరిమీద పగ తీర్చుకోవాలనుకున్నాడో ఏమో కానీ మారిపోయానంటూ ఊరివారినందరినీ నమ్మించాడు. జనవరి 30 న తమ కుమార్తె బర్త్‌డే వేడుకలకు రమ్మని స్థానికుల పిల్లలను తన ఇంటికి పిలిచాడు. అలా వచ్చిన మొత్తం 23మంది చిన్నారులను ఇంటి నేలమాళిగలో బంధించడంతో పాటు కాల్చిపారేస్తానని  బెదరించారు. దీంతో  తమ పిల్లల్ని కాపాడాలంటూ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు తొమ్మిది గంటల ఆపరేషన్ అనంతరం ఎట్టకేలకు  సుభాష్‌ను ఎన్‌కౌంటర్ చేసి పిల్లలను విడిపించారు. ఈ క్రమంలో పారిపోతున్న సుభాష్ భార్య రూబీపై గ్రామస్తులు రాళ్లఎఒ దాడి చేయడంతో హాస్పిటల్ లో చికిత్సపొందుతూ ఆమె మృతి చెందింది. దీంతో సుభాష్‌, రుబీల కుమార్తె అనాథగా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. 

చదవండి : ఫోన్‌లో చూసి, ఖైదీల సాయంతో

పోలీసుల చేతిలో భర్త.. గ్రామస్తుల దాడిలో భార్య!

దుర్మార్గుడి నుంచి పిల్లల్ని సురక్షితంగా కాపాడిన ఎన్‌ఎస్‌జీ

మరిన్ని వార్తలు