తండ్రి ఛాయ్‌వాలా, కూతురు జడ్జీ, ఒకే కోర్టులో

30 Dec, 2015 17:24 IST|Sakshi
తండ్రి ఛాయ్‌వాలా, కూతురు జడ్జీ, ఒకే కోర్టులో

జలంధర్: ఓ ఛాయ్‌వాలా కూతురు కష్టపడి చదవి, పోటీ పరీక్షలు రాసి జడ్జీ అవడం అంత విశేషమేమీ కాకపోచ్చేమోగానీ, తండ్రి సురేందర్ కుమార్ పాతికేళ్లుగా ఛాయ్ అమ్ముతున్న కోర్టులోనే కూతురు స్మృతి జడ్జీగా బాధ్యతలు స్వీకరించబోవడం మాత్రం విశేషమే.  గురునానక్ దేవ్ యూనివర్శిటీలో డిగ్రీ చదివిన స్మృతి, పంజాబ్ యూనివర్శిటీలో లా చేసి పంజాబ్ సివిల్ సర్వీసెస్ (జుడీషియల్) పరీక్ష రాసి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. అందులోనూ ఎస్సీ కేటగిరీలో ట్యాప్ ర్యాంకు సాధించారు. అనంతరం ఏడాది పాటు శిక్షణ పొందారు. ప్రస్తుతం ఆమెకు జలంధర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కోర్టులో జడ్జీగా నియామక ఉత్తర్వులు అందాయి.

అదే కోర్టు ఆవరణలో తండ్రి సురేందర్ కుమార్ పాతికేళ్లుగా టీ కొట్టు నడుపుతున్నారు. తన కూతురు ఏనాటికైనా జీవితంలో పైకి వస్తుందని, మంచి ఉద్యోగం సంపాదిస్తుందని ఊహించానుగానీ జడ్జీ అవుతుందని ఎప్పుడూ అనుకోలేదని సురేందర్ కుమార్ మీడియాతో వ్యాఖ్యానించారు. లీగల్ ప్రొఫెషన్ అంటే తనకు ఎంతో ఇష్టమని, జడ్జి కావాలని ఆశించానని, దాని కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదివానని స్మృతి తెలిపారు. త్వరలోనే ఉద్యోగంలో చేరుతానని ఆమె చెప్పారు.  జలంధర్ కోర్టులో పనిచేసే న్యాయవాదులు, ఇతర సిబ్బంది కూతురు సాధించిన ఘనతకు తండ్రి సురేందర్ కుమార్‌ను అభినందించారు. స్థానికులు స్మృతిని సన్మానించారు.

మరిన్ని వార్తలు