మదర్సా వ్యవస్థను రద్దు చేయండి : వసీం రిజ్వీ

13 Apr, 2018 16:15 IST|Sakshi
షియా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ వసీం రజ్వీ (ఫైల్‌ ఫొటో)

లక్నో : మదర్సా వ్యవస్థను రద్దు చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్‌ సెంట్రల్‌ షియా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ వసీం రిజ్వీని హత్య చేస్తామంటూ బెదిరించిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ డీసీపీ తెలిపారు. మదర్సాల గురించి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే తనని, తన కుటుంబాన్ని హతమారుస్తామని మాఫియా డాన్‌ దావూద్ ఇబ్రహీం అనుచరులు బెదిరిస్తున్నారని షియా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ రిజ్వీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోన్‌ కాల్‌ రికార్డులను కూడా పోలీసులకు అందజేశారు.

వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్‌ రిజ్వీ..!
‘పాకిస్తాన్‌, అఫ్ఘనిస్తాన్‌లలో పేరుపొందిన ఉగ్రవాదులు దియోబంధి మదర్సాలలో తయారు చేయబడ్డారు... ముస్లిం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మదర్సాలు టెర్రరిస్టులను తయారు చేసే కేంద్రాలుగా మారాయని’  ఆరోపిస్తూ రిజ్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, కేబినెట్‌ సెక్రటరీకి ఐదు పేజీలతో కూడిన ఈ- మెయిల్‌ చేశారు. మదర్సా వ్యవస్థను రద్దు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి లేఖ రాసి రజ్వీ వార్తల్లోకెక్కారు.

‘వారంతా పాకిస్తాన్‌ వెళ్లాలి’...
రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించే వారంతా పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలంటూ రిజ్వీ వ్యాఖ్యానించారు. మసీదు పేరిట జిహాద్‌ను వ్యాప్తి చేసేవారు అబూ బకర్‌ ఆల్‌-బాగ్దాదీ లేదా ఐసిస్‌ వంటి ఉగ్రవాద సంస్థల్లో చేరాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా షియా వర్గానికి చెందినవారు రజ్వీ వ్యాఖ్యలను ఖండించారు. ఆయనను అరెస్టు చేయాలంటూ డిమాండ్‌ చేశారు.
 
రాహుల్‌ గాంధీకి లేఖలు..
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సహకరించాలని గత నెలలో రిజ్వీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి లేఖ రాశారు. అంతేకాకుండా దేశంపై, దేవుడిపై ఉన్న ప్రేమను నిరూపించుకోవాలంటే అయెధ్యలో రామ మందిర నిర్మాణం, లక్నోలో మసీద్‌-ఇ-అమన్‌ నిర్మించేందుకు ప్రభుత్వానికి రాహుల్‌ గాంధీ సహకరించాలని సూచించారు.

మరిన్ని వార్తలు