దూబే ఎన్‌కౌంటర్‌: ఓ రోజు ముందుగానే పిటిషన్‌!

10 Jul, 2020 13:04 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘‘వికాస్‌ దూబే సహ నిందితులను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఎలాగైతే మట్టుబెట్టారో.. అతడిని కూడా అదే విధంగా హతమార్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒక్కసారి వికాస్‌ దూబేను యూపీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారంటే అతడు కచ్చితంగా హతమైపోతాడు. పోలీసులు పాత ఎన్‌కౌంటర్‌ కథనే మళ్లీ చెబుతారు’’ అని ముంబైకి చెందిన న్యాయవాది ఘణ్‌శ్యామ్‌ ఉపాధ్యాయ్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అనూహ్య పరిణామాల మధ్య మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో వికాస్‌ దూబే స్థానిక పోలీసుల చేతికి చిక్కిన తర్వాత గురువారం సాయంత్రమే ఆయన ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కరుడుగట్టిన నేరస్తుడైన దూబేపై తనకు సానుభూతి ఏమీ లేదని.. అయితే అఫ్జల్‌ గురు, అజ్మల్‌ కసబ్‌ వంటి దోషుల విషయంలో జరిగినట్లుగానే చట్టపరంగా విచారణ జరగాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. యూపీ పోలీసుల చేతిలో దూబే అంత సులభంగా మరణం పొందేందకూడదని.. ఎవరైనా సరే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదనేదే తన ఉద్దేశమని పేర్కొన్నారు.  (గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే హతం)

ఇక పోలీసులపై దాడికి తెగబడ్డ దూబేకు పోలీస్‌ స్టేషన్‌ నుంచే సమాచారం అందడం, పలువురు ఉన్నతాధికారులతో అతడికి సంబంధం ఉందన్న వార్తల నేపథ్యంలో.. యూపీ పోలీసుల పాలిట భస్మాసురుడిగా మారిన అతడు హతం కావడం ఖాయమని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు. దూబే అనుచరుల ఎన్‌కౌంటర్‌పై సీబీఐ విచారణ జరపడంతో పాటు.. అతడి అరాచకాల్లో పరోక్షంగా పాలుపంచుకున్న రాజకీయ నాయకులపై కూడా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ్‌ కోర్టుకు విన్నవించారు.(వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్: అనేక అనుమానాలు!)

కాగా ఉపాధ్యాయ్‌ ఊహించనట్లుగానే శుక్రవారం దూబే ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం దూబేను మధ్యప్రదేశ్‌ నుంచి కాన్పూర్‌కు తీసుకువస్తుండగా.. పారిపోయేందుకు ప్రయత్నించాడని.. దీంతో అతడిని ఎన్‌కౌంటర్‌ చేసినట్లు యూపీ పోలీసులు వెల్లడించారు. తమ దగ్గర నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరిపాడని, ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడినట్లు పేర్కొనడం గమనార్హం. ఇక ఈ ఎన్‌కౌంటర్‌పై యూపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.(వికాస్‌ దూబే హతం: ‘కారు బోల్తా పడలేదు’!)

మరిన్ని వార్తలు