చనిపోయిన వ్యక్తి లైసెన్స్‌ రద్దు చేస్తూ నోటీసులు

14 Sep, 2019 15:49 IST|Sakshi

జైపూర్‌ : రవాణాశాఖ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. అధికవేగంతో కారును నడపడమేగాక సీటుబెల్టు ధరించనందుకు గాను మీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేస్తున్నామని ఓ వ్యక్తికి నోటీసులు పంపించింది. అయితే సదరు వ్యక్తి ఏనిమిదేళ్ల క్రితమే చనిపోవడం ఇక్కడ గమనార్హం. దీంతో ఖంగుతిన్న కుటుంబసభ్యులు మీడియాకు సమాచారం ఇవ్వడంతో.. ప్రస్తుతం రవాణాశాఖ తన తప్పును సరిదిద్దుకునే పనిలో పడింది.

వివరాలు.. రాజస్తాన్‌ రాష్ట్రం జలావర్‌ జిల్లాకు చెందిన రాజేంద్ర కసేరా 2011లో చనిపోయాడు. ఈ క్రమంలో ఈ నెల 11న రాజేంద్ర కసేరా పేరు మీదుగా అతని ఇంటికి రవాణా శాఖ నుంచి  ఓ లెటర్‌ వచ్చింది. ‘మీరు సీటుబెల్టు ధరించకుండా అధిక వేగంతో కారును నడిపినందుకు గానూ మోటారు వాహన చట్టం సెక్షన్‌ 19 ప్రకారం మీ లైసెన్సును రద్దు చేస్తున్నామని’ ఆ నోటీసులో రవాణాశాఖ పేర్కొంది. అయితే ఇక్కడ విశేషమేంటంటే రాజేంద్ర కసేరాకు కారు లేదు సరికదా బతికి ఉన్నప్పుడు కనీసం ద్విచక్రవాహనాన్ని కూడా నడప లేదంట. ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి ఇప్పుడు కారు నడపడం ఏంటి? కారు కూడా లేని వ్యక్తికి లైసెన్సు ఎలా వచ్చింది అని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. రాజేంద్ర కసేరాను కుటుంబ సభ్యులు మర్చిపోయినా రవాణాశాఖ మర్చిపోలేదని, మన ప్రభుత్వ శాఖల ‘పనితీరు’ అంత బాగా ఉంటుందని అక్కడి గ్రామస్తుడు ఎద్దేవా చేశారు.

కాగా, నిరక్ష్యరాస్యులకు డ్రైవింగ్‌లైసెన్స్‌ రద్దు చేయాలని రాజస్తాన్‌ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. నిరక్ష్యరాస్యులకు సరైన అవగాహన లేక రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని, వారి లైసెన్సులను రద్దు చేయాలని సింగిల్‌ బెంచ్‌ రవాణాశాఖను ఆదేశించింది. దీనిపై ప్రజలలో ఆగ్రహం వ్యక్తం కావడంతో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వుపై డివిజన్‌ బెంచ్‌ స్టే ఇచ్చింది.
(చదవండి : ట్రాఫిక్‌ జరిమానాలు సగానికి తగ్గించారు)

మరిన్ని వార్తలు