ఫ్లైఓవర్ కూలిన ఘటనలో 26 కి పెరిగిన మృతులు

2 Apr, 2016 12:37 IST|Sakshi

కోల్కతా: కోల్కతా మహానగరంలో ఫ్లైఓవర్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య శనివారం 26కు చేరింది. మూడో రోజు సహాయక చర్యలు తుది దశకు చేరుకున్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే దాదాపు 300 మంది సైన్యంతోపాటు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలతోపాటు రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసు, ఫైర్ సిబ్బంది  ఘటన స్థలానికి చేరుకుని..  వెంటనే సహాయచర్యలు ప్రారంభించారు. అయితే సదరు ఫ్లైఓవర్ నిర్మిస్తున్న హైదరాబాద్కు చెందిన ఐవీఆర్సీఎల్ కంపెనీ కార్యాలయాన్ని కోల్కతాలో ఉన్నతాధికారులు సీజ్ చేశారు. అలాగే హైదరాబాద్లోని ఆ సంస్థ కేంద్ర కార్యాలయానికి కోల్కతా పోలీసులు బృందాలు చేరుకుని విచారణ చేపట్టాయి. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫ్లైఓవర్ కూలిన ప్రాంతాన్ని సందర్శించారు. అలాగే బాధిత కుటుంబాలను పరామర్శించారు.

నగరంలోని ఠాగూర్ కూడలి వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ గురువారం కూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 21 మంది మరణించగా... 88 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి... చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురు శుక్రవారం మరణించగా... మరో ఇద్దరు శనివారం కన్నుమూశారు. ఈ ఘటనలో గాయపడిన మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యలు వెల్లడించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరణించిన వారికి, గాయపడిన వారికి ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు