కూతురు కోసం 36 గంటల పోరాటం

23 Mar, 2019 03:48 IST|Sakshi
శిథిలాల నుంచి మహిళను తీసుకొస్తున్న సహాయక సిబ్బంది

ధార్వాడ్‌ భవంతి దుర్ఘటనలో ఓ తల్లి ప్రయత్నం

గాయాలతో ప్రాణాలు కోల్పోయిన బాలిక  

బెంగళూరు: కర్ణాటకలోని ధార్వాడ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవంతి ఇటీవల కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరుకుంది. ఈ ఘటనలో తన కుమార్తెను కాపాడుకునేందుకు 36 గంటల పాటు ఓ తల్లి చేసిన పోరాటం వెలుగులోకి వచ్చింది. విస్టేజ్‌ మార్కెటింగ్‌ సంస్థ ఈ భవంతిలో ఆఫీస్‌ ఏర్పాటుచేసింది. ఈ సంస్థలో ప్రేమా ఉనకల్‌(36) మార్కెటింగ్‌ ప్రతినిధిగా చేస్తోంది. స్కూల్‌కు వేసవి సెలవు కావడంతో ప్రేమాతోపాటు ఆమె కూతురు దివ్య(8) సైతం ఆఫీస్‌కు వచ్చింది.

మంగళవారం సాయంత్రం భవంతి కుప్పకూలిపోవడంతో తల్లీకుమార్తెలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. కొద్దిసేపటి తర్వాత మేలుకున్న ప్రియ, కుమార్తె కోసం వెతుకులాట ప్రారంభించింది. అక్కడే శిథిలాల కింద చిక్కుకున్న దివ్య చేతులు కనిపించాయి. ఆ చీకటిలోనే 45 నిమిషాల పాటు కష్టపడి దివ్యను బయటకు తీసుకొచ్చింది. అంతలోనే అప్పటివరకూ కదలకుండా ఉన్న మరో పిల్లర్‌ చిన్నారి దివ్యపై పడిపోయింది. దీంతో బాలిక బాధతో విలవిల్లాడింది. ఈ పిల్లర్‌ కింద చిక్కుకున్న దివ్యను కాపాడేందుకు ప్రియ మరో 24 గంటల పాటు ప్రయత్నించింది.

చిన్నారి స్పృహ కోల్పోకుండా ఉండేందుకు తాను అంతసేపు మెలకువగానే ఉంది.  20న దివ్య ఏడుపు ఆపేసింది. అదేరోజు ఉదయం అధికారులు యంత్రాల ద్వారా శిథిలాల తొలగింపు ప్రారంభించారు. ఆ శబ్దం విన్న ప్రియ ‘మేమిక్కడ చిక్కుకున్నాం’ అని గట్టిగా అరిచింది. దీంతో అధికారులు ప్రియను రక్షించి ఆసుపత్రికి తరలించారు. దివ్యను శిథిలాల కిందనుంచి బయటకు తీసినప్పటికీ ఆమె అప్పటికే చనిపోయింది. ఈ విషయాన్ని ప్రియ కుటుంబ సభ్యులు ఆమెకు చెప్పలేదు.

ఈ విషయమై ప్రియ పిన్ని మాట్లాడుతూ..‘ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారులు రాగానే తనను కాకుండా కుమార్తెను రక్షించాలని ప్రియ కోరింది. కానీ ఆమెను తొలుత వెలికితీసిన అధికారులు ఆసుపత్రికి తరలించారు. దివ్య అప్పటికే చనిపోయింది. ఈ దుర్ఘటనలో ప్రియ చేతులు, కాళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి. మెలకువలోకి వచ్చిన ప్రతీసారి కుమార్తె దివ్య గురించి ప్రియ అడుగుతోంది. ఏడుస్తూ అంతలోనే స్పృహ కోల్పోతోంది. కానీ దివ్య ఇక లేదన్న విషయాన్ని మేం చెప్పలేకపోతున్నాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు