కల్తీ మద్యం ఘటన : 133కు చేరిన మృతుల సంఖ్య

24 Feb, 2019 15:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అసోంలో చోటుచేసుకున్న కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య ఆదివారం 133కు చేరింది. జోర్హాత్‌ జిల్లాలోని మారుమూల గ్రామాలతో పాటు, సల్మోరా టీ ఎస్టేట్‌లో గురువారం రాత్రి కల్తీ మద్యం సేవించి పలువురు తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. కాగా, కల్తీ మద్యం, తయారీలో పాలుపంచుకున్న పది మందిని అరెస్ట్‌ చేశామని అదనపు డీజీపీ ముఖేష్‌ అగర్వాల్‌ తెలిపారు. లిక్కర్‌ శాంపిల్స్‌ను ఫోరెన్సిక్‌ లేబొరేటరీకి పంపామని, నివేదిక కోసం వేచిచూస్తున్నామని చెప్పారు.

ఎక్సైజ్‌ చట్ట ఉల్లంఘన, మద్యం అక్రమ తయారీ, విక్రయాలకు సంబంధించి మొత్తం 90 కేసులు నమోదు చేశామని ఎక్సైజ్‌ శాఖ అధికారులు వెల్లడించారు. ఈనెల 22 నుంచి తాము 4860 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశామన్నారు. మరోవైపు కల్తీ మద్యంతో తీవ్ర అస్వస్ధతకు లోనై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జోర్హాత్‌ మెడికల్‌ కాలేజ్‌లో ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ పరామర్శించారు. కల్తీ మద్యం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ రెండు లక్షలు, అస్వస్ధతకు గురైన వారికి రూ 50,000 పరిహారం ప్రకటించారు.

మరిన్ని వార్తలు