ప్రధాని మోదీకి 72 గంటల డెడ్‌లైన్‌

15 Jun, 2018 18:42 IST|Sakshi
మీడియాతో ఔరంగజేబ్‌ తండ్రి.. పక్కన ప్రధాని మోదీ (ఇన్‌సెట్లో ఔరంగజేబ్‌ పాత చిత్రం)

శ్రీనగర్‌: ‘ప్రధాని నరేంద్ర మోదీకి నేను 72 గంటల టైమ్‌ ఇస్తున్నా. ఆలోగా నా కొడుకు మరణంపై భారత ప్రభుత్వం పగదీర్చుకోవాలి. లేదంటే మేమే ప్రతీకార చర్యకు దిగుతాం’... ఉగ్రవాదుల చేతిలో పైశాచికంగా హత్యగావించబడిన జవాన్‌ ఔరంగజేబ్‌ తండ్రి చెబుతున్న మాటలివి.

‘2003 నుంచి కశ్మీర్‌ పరిస్థితి మరి దారుణంగా తయారయ్యింది. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక పరిస్థితుల్లో మార్పులు వస్తాయని భావించా. కానీ, ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. పైగా వేర్పాటువాదులు మరింతగా రెచ్చిపోతున్నారు. రాజకీయ నేతలు ఈ ప్రపంచాన్ని ఖూనీ చేస్తున్నారు. కశ్మీర్‌ గడ్డపై రక్తపాతానికి కారణం వాళ్లే. నేతలను, వేర్పాటువాదులను ఇక్కడి నుంచి తరిమేయాలి. రాజకీయాలను పక్కనపడేసి సైన్యం ఉగ్రవాదుల ఏరివేతకు రంగంలోకి దిగాలి. అప్పుడే ఇక్కడి ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. కశ్మీర్‌లో శాంతి వర్థిల్లుతుంది. ప్రధాని మోదీ 72 గంటల్లో నా కొడుకు మరణానికి కారణమైన వాళ్లకి ధీటైన బదులిప్పించాలి. నా కొడుకును చంపిన వాళ్లను అదే రీతిలో సైన్యం కాల్చి చంపాలి. లేదంటే గ్రామస్తులతో కలిసి నేనే సరిహద్దుకు వెళ్తా’ అని ఆయన అల్టిమేటం జారీ చేశారు.

కాగా, ఔరంగజేబ్‌ తండ్రి ఆర్మీలో విధులు నిర్వహించి రిటైర్‌ అయ్యారు. ఔరంగేజ్‌ మావయ్య, సోదరుల్లో ఒకరు కూడా సైన్యంలో పనిచేస్తున్న వాళ్లే. గతంలో ఆ కటుంబంలో ఒకరిని ఉగ్రవాదులు అపహరించి చంపారు కూడా. ఇప్పుడు ఔరంగజేబ్‌ను కూడా ఉగ్రమూకలు పొట్టనబెట్టుకున్నాయి. (చిధ్రమైన ఔరంగజేబ్‌)

ఫూంచ్‌కు చెందిన ఔరంగజేబ్ సోఫియాన్‌లోని షాదిమార్గ్‌ వద్ద ఉన్న రాష్ట్రీయ రైఫిల్స్‌ 44వ దళంలో రైఫిల్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రంజాన్‌ పర్వదినం కావటంతో సెలవుపై ఔరంగజేబు గురువారం ఉదయం తన స్వస్థలానికి బయలుదేరాడు. అయితే మార్గం మధ్యలో అతన్ని ముసుగులు ధరించిన కొందరు అడ్డగించి తమ వెంట తీసుకెళ్లారు. అది గమనించిన ఓ ఫార్మసిస్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగు చూసింది. సైనికుడి అపహరణ విషయం తెలిసిన సైన్యం పెద్ద ఎత్తున్న గాలింపు చేపట్టింది. చివరాఖకిరి శుక్రవారం ఉదయం కలంపోరకు 10 కిలోమీటర్ల దూరంలోని గుస్సూ గ్రామంలో బుల్లెట్లతో ఛిద్రమైన ఔరంగజేబ్‌ మృత దేహాన్ని ఆర్మీ కనుగొంది.

మరిన్ని వార్తలు