నిర్భయ కేసులో ఇద్దరి ఉరి నిలిపివేత

15 Jul, 2014 01:52 IST|Sakshi

సుప్రీంకోర్టు ఉత్తర్వులు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన నిర్భయపై గ్యాంగ్ రేప్, హత్య కేసులో నిందితులు వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్‌లకు విధించిన ఉరిశిక్షను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.  ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు ముఖేష్, పవన్‌గుప్తాలకు విధించిన ఉరిశిక్షను నిలుపుదల చేస్తూ మార్చి 15వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులే వీరికీ వర్తిస్తాయని జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. ఉరిశిక్షలపై అప్పీళ్లను త్రిసభ్య ధర్మాసనం విచారించాలన్న సవరణకు రాష్ట్రపతి ఆమోదం లభించినట్లు వార్తలు వెలువడ్డ నేపథ్యంలో తమ కేసును కూడా త్రిసభ్య ధర్మాసనానికి నివేదిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్న  వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్‌ల వినతిని కోర్టు నిరాకరించింది. సవరణ నిబంధనలను ఇంకా నోటిఫై చేయలేదని పేర్కొంది. ఈ కేసులో నలుగురు నిందితులకు విచారణ కోర్టు విధించిన ఉరిశిక్షను సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వటం తెలిసిందే. దీన్ని నిలిపివేస్తూ సుప్రీం స్టే ఇచ్చింది. ఈ కేసురికార్డులను తమకివ్వాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 
  ఇదిలా ఉండగా, అత్యాచారం లాంటి హేయమైన ఘటనలకు పాల్పడే నిందితులు బాల నేరస్తులైనా వారిని పెద్దలుగానే పరిగణించాలన్న కేంద్ర మంత్రి మేనకాగాంధీ వ్యాఖ్యలను నిర్భయ తల్లిదండ్రులు స్వాగతించారు. గ్యాంగ్ రేప్ కేసుల్లో బాల నేరస్తులను సాకుగా చూపి వారి తరఫు న్యాయవాదులు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని నిర్భయ తండ్రి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు