దారిద్య్రం దిగొచ్చింది!

28 Jan, 2019 02:38 IST|Sakshi

భారత దేశంలో తగ్గుతున్న పేదల జనాభా

2011 లెక్కల ప్రకారం దేశంలో పేదల సంఖ్య 26.80 కోట్లు 

పలు నివేదికల ప్రకారం ఇప్పటి పేదల సంఖ్య 5కోట్లు

భారత్‌.. పేద దేశం అనే భావన క్రమక్రమంగా తొలగిపోతోంది. ప్రభుత్వాలు తీసుకుంటున్న పలు చర్యలు, అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల ఫలితంగా దేశంలో పేదల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం రోజుకు 1.90 డాలర్ల కంటే (దాదాపు రూ.120) తక్కువ సంపాదన ఉన్న వారు కటిక పేదలు. 2011లో జరిపిన సర్వే ప్రకారం దేశంలో 26 కోట్ల 80 లక్షల మంది కటిక దారిద్య్రంలో బతుకుతున్నారు. అయితే, ఇప్పుడు వీరి సంఖ్య 5 కోట్ల లోపే ఉందని తాజా సర్వే నివేదికలు పేర్కొంటున్నాయి. –సాక్షి నాలెడ్జ్‌సెంటర్‌

పేదల జనాభా  తగ్గింది..
గృహ వినియోగం (ఒక ఇంటివాళ్లు ఎంత ఖర్చు చేస్తున్నారన్నది) గణాంకాల ఆధారంగా దేశంలో పేదరికాన్ని అంచనా వేయడం జరుగుతుంది. దేశంలో 2011లో గృహ వినియోగ సర్వే జరిగింది. తర్వాత సర్వే 2017–18లో జరిగింది. ఆ గణాంకాల నివేదిక ఈ ఏడాది జూన్‌లో వెలువడుతుంది. తాజాగా నిర్వహించిన గృహ వినియోగ సర్వే ఆధారంగా దేశంలో పేదల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలుస్తోందని భారత ప్రధాన గణకుడు (స్టాటష్టీషియన్‌) ప్రవీణ్‌ శ్రీవాత్సవ చెప్పారు. తాజా గణాంకాల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని అంచనా వేసే వరల్డ్‌ డేటా ల్యాబ్‌ ప్రస్తుతం దేశంలో పేదల సంఖ్య 2011తో పోలిస్తే బాగా తగ్గిందని తెలిపింది.

రోజుకు 1.90 డాలర్ల కంటే తక్కువ సంపాదించే వారు 5 కోట్ల కంటే తక్కువ ఉండొచ్చని అంచనా వేసింది. త్వరలోనే ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా అవతరించనున్న భారత్‌లో దారిద్య్రం కూడా శరవేగంగా తగ్గుతోందని, 2017–18 గృహ వినియోగ సర్వే నివేదిక బయటికొస్తే దారిద్య్రం తగ్గుదల మరింత కచ్చితంగా తెలుస్తుందని బ్రూకింగ్స్‌ నివేదిక పేర్కొంది. ఈ సంవత్సరం చివరికి కటిక పేదలు 4 కోట్లకు తగ్గుతారని, 2030 నాటికి భారతదేశంలో కేవలం 30 లక్షల మంది మాత్రమే కటిక దారిద్య్రంలో ఉంటారని ఆ నివేదిక అంచనా వేసింది.

పథకాలు, సాంకేతికతే కారణం
ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకోవడం, సామాజిక సంక్షేమ పథకాలు, కార్యక్రమాల్లో సాంకేతికత వినియోగం, నగదు బదిలీ వంటి పథకాలు దేశంలో దారిద్య్రం తగ్గడానికి దోహదపడ్డాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 2004–05 నుంచి దేశంలో కటిక పేదరికం నిలకడగా తగ్గుతూ వస్తోందని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ ప్రొఫెసర్‌ ఎన్‌ఆర్‌ భానుమూర్తి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సమ్మిళిత అభివృద్ధి విధానాలు, ఎంఎన్‌ఆర్‌ఇజీఏ, ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన వంటి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకాలు విజయవంతం కావడంతో పేదలు తగ్గుతున్నారని వివరించారు. 2030 నాటికి మన దేశం అత్యధిక పేదలున్న పది దేశాల జాబితా నుంచి తొలగిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
 

మరిన్ని వార్తలు