నిద్రపోతే ప్రాణానికే ముప్పు!

25 Jan, 2019 14:12 IST|Sakshi

అరుదైన వ్యాధితో బాధపడుతోన్న 6 నెలల బాలుడు

న్యూఢిల్లీ: ఆరోగ్యం బాగుండాలంటే సరిపడ నిద్ర ఉండాలని వైద్యులు చెబుతుంటారు. అయితే అదే నిద్ర ఓ బాలుడి పాలిట శాపంగా మారింది. నిద్ర శాపంగా మారడం ఏంటని అనుకుంటున్నారా! అయితే ఇది చదవండి... న్యూఢిల్లీకి చెందిన యదార్థ్‌ (6 నెలలు) అనే బాలుడు అరుదైన ‘సెంట్రల్‌ హైపర్‌ వెంటిలేషన్‌ సిండ్రోమ్‌’ వ్యాధితో బాధపడుతున్నాడు. జన్యులోపాల కారణంగా పుట్టుకతోనే ఈ వ్యాధి వస్తుంది. దీని వల్ల శరీరంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ స్థాయిలు పెరుగుతున్నా నరాలు దాన్ని మెదడుకు చేరవేయడంలో విఫలమవుతాయి. 

అందువల్ల ఈ వ్యాధి ఉన్నవారు గాఢ నిద్రలోకి వెళ్తే ఆక్సిజన్‌ తగ్గి, ప్రాణాపాయ స్థితి తలెత్తవచ్చు. అందుకే యదార్థ్‌ తల్లి తన  బిడ్డను నిద్రపోనివ్వకుండా కాపాడుకుంటోంది. మరి ఈ వ్యాధికి చికిత్స లేదా అంటే.. కచ్చితంగా ఉంది కానీ చాలా ఖర్చుతో కూడుకుంది. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ నిరుపేద కుటుంబానికి ఇది తలకి మించిన భారంగా మారింది. ‘చికిత్సకు అయ్యే ఖర్చుని ప్రభుత్వం భరిస్తే మా బాబు బతుకుతాడ’ని యదార్థ్‌ తండ్రి ప్రవీణ్‌ వేడుకుంటున్నారు. కాగా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1,300 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్య నివేదికలు చెబుతున్నాయి. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు