వారిద్దరూ అమ్మ వారసులే

28 May, 2020 07:55 IST|Sakshi

దీప, దీపక్‌లపై హైకోర్టు వ్యాఖ్య

జయ స్మారకమందిరంగా ‘వేద నిలయం’ 

సాక్షి  చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వివాదం కోర్టు తీర్పుతో ఒక కొలిక్కి వచ్చింది. కొంత ప్రభుత్వానికి మిగిలినది జయ అన్న కుమార్తె దీప, కుమారుడు దీపక్‌కు చెందేలా బుధవారం తీర్పు చెప్పింది. ఈ పంపకాలపై 8 వారాల్లోగా బదులు పిటిషన్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షులు ఎంజీ రామచంద్రన్‌ మరణం తరువాత ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలిత తమిళనాడు రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. పలుసార్లు అన్నాడీఎంకేను అధికారపీఠంలో కూర్చొనబెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అదే స్థాయిలో భారీ ఎత్తున ఆస్తులను సైతం కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అనధికారికంగా వేలాది కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే  జయలలితకు చెన్నై పోయెస్‌గార్డెన్‌లో బంగ్లా, కొడైకెనాల్‌లో ఎస్టేట్, హైదరాబాద్‌లో ద్రాక్షతోట రూ.913 కోట్ల విలువైన ఆస్తులున్నాయని అధికారిక సమాచారం. (రక్త సంబంధీకులు వారసులు కారా? )

2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొద్ది నెలల్లోనే ఆమె అస్వస్థకు గురై అనూహ్యమైన రీతిలో అదే ఏడాది డిసెంబర్‌ 5నఅకస్మాత్తుగా కన్నుమూశారు. వివాహం చేసుకోకుండా ఆధ్యంతం కుమారిగానే జీవించినందున ఆమె కూడబెట్టిన కోట్లాది రూపాయల ఆస్తులకు వారసులు ఎవరనే అంశంపై పెద్ద చర్చనీయాంశమైంది. జయ మరణించిన తరువాత ఆదాయపు పన్నుశాఖాధికారులు జయ నివాసం పోయెగార్డెన్‌లో తనిఖీలు చేసినపుడు ఆస్తి పంపకాలు చేసినట్లు ఎలాంటి పత్రాలు దొరకలేదు. జయ రక్త సంబం«దీకులుగా ఆమె అన్న జయకుమార్‌ కుమార్తె దీప, కుమారుడు దీపక్‌ మాత్రమే ఉన్నారు. అయితే జయతో వారికి సత్సంబంధాలు, పోయెస్‌గార్డెన్‌ ఇంటికి రాకపోకలు లేనందున ఆస్తులు వివాదంలో చిక్కుకున్నాయి. జయ ఆస్తికి, రాజకీయాలకు సైతం తామే వారసులమని దీప గళమెత్తినా చట్టబద్ధత లేకుండా పోయింది. పోయెగార్డెన్‌లో ఇంటిని జయస్మారక మందిరంగా మార్చాలని అన్నాడీఎంకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. (స్మారక మందిరంగా జయలలిత నివాసం)

అత్త (జయలలిత) ఆస్తులపై ఏకపక్ష నిర్ణయం తీసుకునే అధికారం అన్నాడీఎంకే ప్రభుత్వానికి లేదని దీప అభ్యంతరం పలికింది. జయ ఆస్తులపై తమకు తెలియకుండా ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకు వీల్లేదని గట్టిగా అడ్డుతగిలింది. ఈ పరిస్థితిలో జయ ఆస్తుల పర్యవేక్షణకు ప్రయివేటు నిర్వాహకుడిని నియమించాల్సిందిగా కోరుతూ అన్నాడీఎంకే నేత పుహళేంది, జానకిరామన్‌ అనే మరో వ్యక్తి మద్రాసు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. జయలలిత అన్న కుమారుడు దీపక్, కుమార్తె దీపను ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు. జయ చట్టపూర్వక వారసులమైన తమను నిర్వాహకులుగా నియమించాలని వారిద్దరూ కోర్టుకు విన్నవించుకున్నారు. జయ ఆస్తిపన్ను బకాయి ఉన్నారంటూ ఆదాయపు పన్నుశాఖ కొంత ఆస్తిని గతంలోనే జప్తుచేసి ఉంది. చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని జయ నివాసం ‘వేద నిలయం’ను జయ స్మారకమందిరంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అత్యవసర చట్టం తీసుకొచ్చింది. జయ ఆస్తులపై దాఖలైన పిటిషన్లపై వాదోపవాదాలు ముగియగా తీర్పు తేదీని ప్రకటించకుండా న్యాయమూర్తులు ఈ కేసును వాయిదావేశారు. 

జయ ఆస్తులపై సిఫార్సులతో తీర్పు: 
ఇదిలా ఉండగా, జయలలిత ఆస్తుల వివాదానికి సంబంధించి కొన్ని సిఫార్సులతో మద్రాసు హైకోర్టు  న్యాయమూర్తులు కృపాకరన్, అబ్దుల్‌ ఖుద్దూస్‌ బుధవారం తీర్పును ప్రకటించారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘పోయెస్‌గార్డెన్‌లోని ఇంటినంతా స్మారకమండపంగా మార్చాల్సిన అవసరం లేదు, కొంతభాగాన్ని సీఎం క్యాంప్‌ ఆఫీస్‌గా చేయవచ్చు. ఈ సిఫార్సులను ప్రభుత్వం పరిశీలించి స్మారక మండపంపై నిర్ణయం తీసుకోవాలి. ప్రయివేటు ఆస్తుల కొనుగోలుపై ప్రజల హృదయాల్లో అనేక సందేహాలుంటాయి. అందుకే జయ ఆస్తుల నిర్వహణకు ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలి. ఆ  ట్రస్ట్‌లో దీప, దీపక్‌లను సభ్యులుగా చేర్చాలి. వీరిద్దరికీ ప్రభుత్వం 24 గంటలపాటూ సాయుధ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలి.

జయ ఆస్తుల్లోని కొంత భాగాన్ని అమ్మివేసి ఆ సొమ్మును బ్యాంకులో డిపాజిట్‌ చేయాలి. డిపాజిట్‌పై వచ్చే ఆదాయం నుంచి దీప, దీపక్‌లకయ్యే పోలీసు బందోబస్తు ఖర్చుకు వినియోగించాలి. రెండో తరం వారసులుగా జయ అన్న కుమార్తె, కుమారునికి జయ ఆస్తిపై హక్కు ఉంటుంది. ఈ సిఫార్సులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని 8 వారాల్లోగా కోర్టులో బదులు పిటిషన్‌ దాఖలు చేయాల’ని వారు తీర్పులో పేర్కొన్నారు. జయ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులుగా పరిగణిస్తూ నిర్వాహక అధికారిని నియమించుకునే అవకాశాన్ని కలి్పంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తులు కొట్టివేశారు. 

అన్నింటికి వారసులం: దీప 
దివంగత సీఎం, తన మేనత్త ఆస్తులకే కాదు ఆమె ఆశయాలు, లక్ష్యాలకు వారసులం తాను, తన సోదరుడు దీపక్‌ అని దీప వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో మీడియా ముందుకు బుధవారం సాయంత్రం దీప వచ్చారు. కోర్టు ఇచ్చిన సూచనల్లో తమను వారసులుగా పేర్కొనడం ఆనందంగా ఉందన్నారు. తాను, తన సోదరుడు ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతామని తెలిపారు. పారంపర్య ఆస్తులే కాదు, మేనత్త ఆస్తులకు తామిద్దరం వారసులమని, ఆమె ఆశయ సాధన, లక్ష్యాల్లోను వారసులంగా ఉంటామన్నారు. 

>
మరిన్ని వార్తలు