జేఎన్‌యూలో దీపిక

8 Jan, 2020 03:45 IST|Sakshi
విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వర్సిటీకొచ్చిన దీపిక

విద్యార్థులకు సంఘీభావం

హింసాకాండకు తమదే బాధ్యతన్న హిందూరక్షా దళ్‌

జేఎన్‌యూఎస్‌యూ ప్రెసిడెంట్‌ ఆయిషీపై కేసు

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్‌ నటి దీపిక పదుకొనే మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని జేఎన్‌యూని సందర్శించారు. వర్సిటీలో ఆదివారం ముసుగులు ధరించిన దుండుగులు విచ్చలవిడిగా దాడిచేసి పలువురు విద్యార్థులు, టీచర్లను తీవ్రంగా గాయపర్చిన విషయం తెలిసిందే. బాధిత విద్యార్థులకు సంఘీభావంగా దీపిక జేఎన్‌యూకి వచ్చారు. నలుపు దుస్తులు ధరించి వచ్చిన దీపిక.. దాదాపు 10 నిమిషాల పాటు క్యాంపస్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆజాదీ నినాదాలతో ఆమెకు స్వాగతం పలికారు. 7.40 గంటలకు క్యాంపస్‌లోకి వచ్చిన దీపిక అక్కడ జరిగిన ఒక పబ్లిక్‌ మీటింగ్‌కు హాజరయ్యారు. అయితే, విద్యార్థులనుద్దేశించి దీపిక ఏమీ మాట్లాడలేదు.  జేఎన్‌యూలో దీపిక ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

దర్యాప్తు ప్రారంభం 
జేఎన్‌యూలో హింసపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హింసకు సంబంధించిన ఆడియో, వీడియో తదితర ఆధారాలను అందించాల్సిందిగా ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. దాడికి బాధ్యత వహిస్తున్నామని ఒక హిందుత్వ సంస్థ ప్రకటించింది. జేఎన్‌యూ విద్యార్థులపై దాడికి సంబంధించి హిందూ రక్షాదళ్‌ అనే సంస్థ మంగళవారం ఒక వీడియోను విడుదల చేసింది. పింకీ చౌధరిగా తనను తాను ఆ వీడియోలో పరిచయం చేసుకున్న వ్యక్తి.. జాతి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడేవారికి జేఎన్‌యూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పట్టిన గతే పడ్తుందంటూ హెచ్చరికలు జారీ చేశారు.

యూనివర్సిటీ సర్వర్‌ రూమ్‌ను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌పై కేసు నమోదు అయింది. సర్వర్‌ రూమ్‌ను ధ్వంసం చేయడానికి సంబంధించి ఘోష్‌ సహా జేఎన్‌యూఎస్‌యూ విద్యార్థి సంఘ కీలక నేతల పేర్లను వర్సిటీ అధికారులు పోలీసులకు ఇచ్చారు.  ‘జరిగిన ఘటన దురదృష్టకరం.గతాన్ని పక్కనబెట్టి.. విద్యార్థులంతా తిరిగి క్యాంపస్‌కు రావాలి’ అని జేఎన్‌యూ వీసీ జగదీశ్‌ కుమార్‌ కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదలచేశారు.

మరిన్ని వార్తలు