అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది?

12 Apr, 2017 14:54 IST|Sakshi
అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది?

అమితాబ్ బచ్చన్, శశి కపూర్ నటించిన మల్టీ స్టారర్‌ చిత్రం.. దీవార్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. నిజాయితీపరుడైన పోలీసు అధికారిగా శశికపూర్, దొంగతనాలు చేసి ఎక్కువ డబ్బు సంపాదించిన మనిషిగా అమితాబ్ ఇందులో నటిస్తారు. వాళ్లిద్దరి తల్లి నిరుపమా రాయ్ మాత్రం నిజాయితీపరుడైన చిన్న కొడుకు దగ్గరే ఉంటానని సినిమాలో చెబుతారు. ఈ సినిమా పోస్టర్‌ను స్వచ్ఛభారత్‌ ప్రచారం కోసం ఉపయోగించుకున్న తీరు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టిని కూడా ఆకర్షించింది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన నైనిటాల్‌లో ఎవరో ఈ పోస్టర్ అతికించారు. అందులో ఒకవైపు అమితాబ్, మరోవైపు శశికపూర్‌ ఉండగా వాళ్లిద్దరికి మధ్యలో తల్లి నిరుపమా రాయ్ ఉంటారు. సినిమాలోని 'అమ్మ' సీన్‌ను ఇక్కడ యథాతథంగా ఉపయోగించుకున్నారు. అయితే డైలాగును మాత్రం కొద్దిగా మార్చారు.

నిజాయితీపరుడైన చిన్నకొడుకు దగ్గర ఉంటానని చెప్పాల్సిన తల్లి.. ''ముందుగా ఎవరు ఇంట్లో బాత్రూం కట్టిస్తారో వాళ్ల దగ్గరే నేను ఉంటా'' అని చెప్పినట్లుగా ఆ పోస్టర్‌లో ఉంది. పర్యాటకులు ఎక్కువగా వచ్చే నైనిటాల్‌లో ప్రజలను స్వచ్ఛభారత్‌ దిశగా ప్రోత్సహించేందుకు ఎవరో ఈ పోస్టర్‌ను రూపొందించి అక్కడ అతికించారు. దాన్ని ప్రధాని నరేంద్రమోదీకి ఒక ఫాలోవర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌ చూసిన మోదీ.. దాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోయారు. స్వచ్ఛభారతాన్ని ప్రోత్సహించేందుకు ఇలా సినిమాలను కూడా ఉపయోగించుకుంటున్నారని, ఇది చాలా సృజనాత్మకంగా ఉందని ఆయన సమాధానం ఇచ్చారు. 2019 నాటికి బహిరంగ మలవిసర్జనను పూర్తిగా అరికట్టాలన్న ఉద్దేశంతో 2014 సంవత్సరంలో ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

 

మరిన్ని వార్తలు