వైరల్‌: అమర జవాన్ల తల్లులకు పాదాభివందనం

5 Mar, 2019 09:11 IST|Sakshi

డెహ్రాడూన్‌ : పుల్వామా ఉగ్ర దాడిలో వీరమరణం పొందిన సీఆర్పీఎఫ్‌ జవాన్ల తల్లులకు రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ పాదాభివందనం చేశారు. ఉత్తరాఖండ్, డెహ్రాడూన్‌లో సోమవారం జరిగిన ‘శౌర్య సమ్మాన్ సమరోహ్’ కార్యక్రమంలో రక్షణ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర జవాన్ల తల్లులను, సతీమణులను ఆమె ఘనంగా సన్మానించారు. వారిని శాలువతో సత్కరించారు. అనంతరం జవాన్ల తల్లులకు పాదాభివందనం చేసి వారిపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

పాదాలకు నమస్కరించేందుకు మంత్రి కిందకు వంగుతుండడంతో అవాక్కైన కొందరు తల్లులు వారించినా నిర్మలా సీతారామన్‌ పట్టించుకోలేదు. అమరవీరుల తల్లులకు మంత్రి ఇస్తున్న గౌరవాన్ని చూసిన అధికారులు, కార్యక్రమానికి హాజరైన వారు కరతాళ ధ్వనులతో అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఒన్‌ ర్యాంక్‌ ఒన్‌ పెన్షన్‌ అంశంపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడంపై మండిపడ్డారు. గత ప్రభుత్వం రూ.500 కోట్లరూపాయలనే మంజూరు చేసిందని, కానీ నరేంద్రమోదీ ప్రభుత్వం గత మూడేళ్లలో రూ.35వేల కోట్లు ఆర్మీ మాజీ ఉద్యోగులకు అందజేసిందన్నారు. అమరుల స్మారక స్థూపంపై కూడా విమర్శలు చేయడం తగదని ప్రతిపక్షాలకు సూచించారు. గత 60 ఏళ్లుగా స్మారకస్థూపాన్ని నిర్మించలేకపోయారని, నాలుగు పెద్ద యుద్దాలు జరిగినా ఒక్క స్మారక స్థూపాన్ని నిర్మించలేదని మండిపడ్డారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ప్రతిఒక్కరికి ఈ స్థూపం అంకితమన్నారు.

మరిన్ని వార్తలు