అంతరిక్ష యుద్ధ తంత్రం

12 Jun, 2019 08:03 IST|Sakshi

న్యూఢిల్లీ: అంతరిక్షయానంలో తిరుగులేని విజయాలు సొంతం చేసుకున్న భారత్, అంతరిక్ష యుద్ధతంత్రంలోనూ పైచేయి సాధించే దిశగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా అంతరిక్షంలో యుద్ధాలు సాగించేందుకు అనువైన వ్యవస్థల రూపకల్పన కోసం అంతరిక్ష రక్షణ సంస్థ(డీఎస్‌ఏ)ను ఏర్పాటు చేయనుంది. డీఎస్‌ఏకు అవసరమైన పరిశోధన, అభివృద్ధి వ్యవస్థలను సమకూర్చేందుకు రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఎస్‌ఆర్‌వో)ను ఏర్పాటు చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళవారం సమావేశమైన రక్షణపై కేబినెట్‌ కమిటీ (సీసీఎస్‌) అంతరిక్ష యుద్ధతంత్రానికి అవసరమైన అధునాతన యుద్ధ వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి డీఎస్‌ఆర్‌వో అనే కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని తీర్మానించింది. 

డీఎస్‌ఏలో ఎంపిక చేసిన శాస్త్రవేత్తల బృందంతోపాటు త్రివిధ దళాలకు చెందిన అధికారులు కూడా ఉంటారు. బెంగళూరు కేంద్రంగా ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ అధికారి నేతృత్వంలో ఇది పనిచేస్తుంది. ఇటీవల భారత్‌ అంతరిక్షంలోని కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాన్ని క్షిపణిని ప్రయోగించి తుత్తునియలు చేసిన విషయం తెలిసిందే. ఈ సత్తాను సంపాదించుకున్న నాలుగో దేశంగా అగ్రరాజ్యాల సరసన నిలిచింది. అంతేకాకుండా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘స్పేస్‌ ఫోర్స్‌’ ఏర్పాటు చేస్తామంటూ ఇటీవల ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం డీఎస్‌ఆర్‌వో ఏర్పాటుకు నిర్ణయించడం గమనార్హం. 

మరిన్ని వార్తలు