కశ్మీర్‌పై అనుమానాలేం లేవు

18 Jan, 2020 03:57 IST|Sakshi

2025 కల్లా భారత్‌కు ఎస్‌–400 క్షిపణి వ్యవస్థ అందిస్తాం: రష్యా

న్యూఢిల్లీ: కశ్మీర్‌  విషయంలో భారత్‌ వ్యవహరిస్తున్న తీరుపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని రష్యా స్పష్టం చేసింది. కశ్మీర్‌ సమస్య భారత్, పాకిస్తాన్‌ల మధ్య ద్వైపాక్షిక అంశమేనని భారత్‌లో రష్యా రాయబారి నికొలయ్‌ కుదషేవ్‌ వ్యాఖ్యానించారు. తన డిప్యూటీ రోమన్‌ బబుష్కిన్‌తో కలిసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కశ్మీర్‌ను సందర్శించిన విదేశీ రాయబారుల బృందంలో రష్యా రాయబారులు లేకపోవడంపై ప్రశ్నించగా.. ‘కశ్మీర్‌కు సంబంధించి భారత్‌ తీరుపై అనుమానాలున్నవారు అక్కడికి వెళ్తారు. మాకేం అనుమానాలు లేవు’ అని కుదషేవ్‌ స్పందించారు.

భారత్‌ పంపే ఎస్‌ – 400 ఉత్పత్తి ప్రారంభం 
గగన రక్షణ క్షిపణి వ్యవస్థ ఎస్‌ –400ను 2025 నాటికి భారత్‌కు అందిస్తామని ఈ సందర్భంగా బబుష్కిన్‌ వెల్లడించారు. భారత్‌కు సరఫరా చేసే ఐదు ‘ఎస్‌ –400’ క్షిపణుల ఉత్పత్తిని ఇప్పటికే ప్రారంభించామన్నారు. ఎస్‌– 400 వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత సమర్ధవంతమైందని, భారత గగనతల రక్షణ వ్యవస్థను ఇది మరింత బలోపేతం చేస్తుందని బబుష్కిన్‌ పేర్కొన్నారు. 400 కిమీల దూరంలోని శత్రు విమానాలను, క్షిపణులను, డ్రోన్లను గుర్తించి, నాశనం చేయగల సామర్థ్యం ఎస్‌ –400 సొంతం. ఇది ఇప్పటివరకు రష్యా రక్షణ దళాలకు మాత్రమే అందుబాటులో ఉండేది. బహుళ ఉపయోగకర తేలికపాటి మిలటరీ హెలికాప్టర్‌ కమోవ్‌ను సంయుక్తంగా ఉత్పత్తి చేసేందుకు ఉద్దేశించిన ఒప్పందం త్వరలో ఖరారవుతుందన్నారు.

మరిన్ని వార్తలు