భారీ వర్షాలు.. అయినా తప్పదా?

20 Aug, 2017 20:13 IST|Sakshi

న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను వానలు ముంచెత్తుతున్నా ఇంకా చాలా ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదైంది. దేశంలో నాలుగింట ఓ వంతు ప్రాంతంలో కనీస వర్షపాతం కూడా నమోదు కాలేదని గణాంకాలు చెబుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో మాత్రం అక్కడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేం‍ద్రం (ఐఎండి) అంచనా వేస్తోంది.

                      మధ్యప్రదేశ్‌, కేరళ, మహారాష్ట్ర, కర్నాటక, పశ్చిమ యూపీలోని కొన్ని ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదైందని ఐఎండి పేర్కొంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.కర్నాటకలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, మరాఠ్వాడా, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు ఆరంభమయ్యాయని, కొద్దిరోజుల్లో పరిస్థితి మెరుగవుతుందని ఐఎండి డైరెక్టర్‌ జనరల్‌ కేజే రమేష్‌ చెప్పారు. రానున్న రెండు వారాల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ సహా మధ్య భారత్‌లో భారీ వర్షాలు కురవనున్నాయని ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాధవన్‌ రాజీవన్‌ ట్వీట్‌ చేశారు. మరోవైపు తూర్పు యూపీ, బీహార్‌, అసోం, గుజరాత్‌లో వరదలు పోటెత్తాయి.

మరిన్ని వార్తలు