‘అర్బన్‌ నక్సల్‌’ అంటే ఏంటి?: రొమిలా థాపర్‌

1 Oct, 2018 03:56 IST|Sakshi
రొమిలా థాపర్‌

న్యూఢిల్లీ: ‘అర్బన్‌ నక్సల్‌’ అనే మాటకు అర్థం ఏమిటో చెప్పాలని ప్రముఖ చరిత్రకారిణి రొమిలా థాపర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తనతోపాటు తనవంటి కార్యకర్తలకు ఆ మాటకు నిర్వచనం తెలియదని అన్నారు. వామపక్ష అనుకూల కార్యకర్తల గృహ నిర్బంధానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో థాపర్‌ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘అర్బన్‌ నక్సల్‌ అని పిలవడం తేలికైపోయింది. అర్బన్‌ నక్సల్స్‌ అంటే వారికి అర్థం తెలుసా? ముందుగా ప్రభుత్వాన్ని ఆ మాటకు అర్థం చెప్పమనండి. ఆ కేటగిరీలో మేమెలా ఉంటామో, అర్బన్‌ నక్సల్స్‌ ఎలా అయ్యామో చెప్పమనండి. అర్బన్‌ నక్సల్‌ నిర్వచనం ప్రభుత్వానికీ తెలియదా లేదా మాకు అర్థం కాలేదా చెప్పమనండి’ అని అన్నారు. సమాజంలో మంచి కోసం పోరాడుతున్న వారికి అర్బన్‌ నక్సల్స్‌ అని పేరు పెట్టటం వెనుక రాజకీయ కారణాలున్నాయని ఆమె ఆరోపించారు.

మరిన్ని వార్తలు