కొత్తేడాది మొదటిరోజే కాలుష్యం కాటు

2 Jan, 2018 08:51 IST|Sakshi

ఢిల్లీలో మళ్లీ పెరిగిన వాయుకాలుష్యం

సాక్షి, న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం వేళ దేశ రాజధానిలో వాయు కాలుష్యం మరోసారి పెరిగిపోయింది. పొగమంచుతో పాటు కొత్త ఏడాది సందర్భంగా బాణాసంచా కాల్చడంతో ఢిల్లీలో కాలుష్య స్థాయి 400 పాయింట్లుగా నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. సోమవారం 6 గంటల వరకు గాలిలో కాలుష్య కారకాలైన పీఎం 2.5 రేణువులు 311గా, పీఎం10 రేణువులు 471.5గా నమోదైనట్లు వెల్లడించింది. పొగమంచు ప్రభావంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం 550 విమానాలు ఆలస్యం కాగా, 23 విమానాలు రద్దయ్యాయి.

మరోవైపు కొత్త ఏడాది సందర్భంగా ఇండియాగేట్‌ వద్దకు ప్రజలు తరలిరావడంతో మధ్య సెక్రటేరియట్‌ మెట్రో స్టేషన్‌ వద్ద భారీ రద్దీ నెలకొంది. దీంతో ప్రజల్ని అదుపు చేసేందుకు పలు మార్గాలను మూసేశారు. దాదాపు 2.25 లక్షల మంది ప్రజలు సోమవారం సాయంత్రం నాటికి ఇండియా గేట్‌ను సందర్శించినట్లు పోలీసులు తెలిపారు.  

పొగమంచు కారణంగా మంగళవారం 20 విమానాలు ఆలస్యం కాగా, ఆరు విమాన సర్వీసులు రద్దయ్యాయి. 64 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 24 రైళ్లను రీషెడ్యూల్‌ చేయగా, 21 రైళ్ల సర్వీసులు రద్దు చేశారు.

మరిన్ని వార్తలు