దీపావళి ఎఫెక్ట్‌; ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం

28 Oct, 2019 10:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దీపావళి వేళ దేశ రాజధానిలో పర్యావరణ కాలుష్యం తారాస్థాయికి చేరింది. పండగ వేడుకల అనంతరం నగరాన్ని కాలుష్యం మరింత కమ్మేసింది. ‘సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్(సఫర్)’ నివేదిక ప్రకారం.. దేశ రాజధానిలో సోమవారానికి పవన నాణ్యత సూచీ ఉదయం 9 గంటలకు 463గా ఉండటంతో కాలుష్యం ప్రమాద స్థాయికి చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ ఒకటిగా ఉన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఢిల్లీ కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా.. సుప్రీంకోర్టు 2018లోనే వాతావరణానికి హాని కలిగించే టపాసులను కాల్చరాదని, కేవలం ఎకో ఫ్రెండ్లీ టపాసులను మాత్రమే కాల్చాలని ఆదేశించింది.

ఈ క్రమంలో సుప్రీం ఆదేశాలతో ఢిల్లీ ప్రభుత్వం బహిరంగ టపాసుల అమ్మకాలను నిషేధించగా కాకరవొత్తులు, చిచ్చుబుడ్లను మాత్రమే కాల్చుకోవడానికి అనుమతినిచ్చింది. ఇవి కూడా కేవలం ప్రభుత్వం తయారు చేసినవి మాత్రమే కొనాలని సూచించింది. వీటి ప్యాకెట్లపై క్యూఆర్‌ కోడ్‌ కూడా ఉంటుందని పేర్కొంది. ఇందుకు తోడు రాజధానిలో కేవలం రాత్రి 8 గంటల నుంచి 10 వరకు మాత్రమే బాణాసంచా పేల్చాలని ఆంక్షలు విధించింది.  అంతేగాక  శనివారం నుంచి రాత్రి సమయాల్లో భవన నిర్మాణ పనులను నిలిపి వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రస్తుతం నమోదైన కాలుష్యపు సూచీ చూస్తుంటే నగర వాసులు సుప్రీంకోర్టు ఆదేశాలను భేఖాతరు చేసినట్లు కనిపిస్తోంది.

ఢిల్లీ కాలుష్యాన్ని అదుపులో ఉంచేందుకు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సరి-బేసి విధానాన్ని నవంబర్‌ 4 నుంచి 15 వరకు మరో దఫా అమలు చేయనున్నారు. సాధారణంగా పవన నాణ్యత సూచీ 0-50 మధ్య ఉంటే మంచిదని, 51-100 ఫర్వాలేదని, 101-200 మధ్య రకమని, 201-300 బాలేదని, 301-400 పూర్తిగా బాలేదని, అలాగే 401-500 తీవ్రమైనది-ప్రమాదకరమని సఫర్‌ నివేదించింది.

చదవండిఢిల్లీలో ఆ రెండే కాల్చాలి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా