అసెంబ్లీలో అధ్యయన కేంద్రం

13 Feb, 2019 08:15 IST|Sakshi

ఆప్‌ ప్రభుత్వ వినూత్న ఆలోచన

యువతకు ఫెలోషిప్‌ ప్రోగ్రాం 

శాసనసభా కార్యకలాపాలపై అవగాహన   

శాసనసభ్యులను మరింత నిష్ణాతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం 

దరఖాస్తులకు తుది గడువు 25

న్యూఢిల్లీ: అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ అసెంబ్లీ రీసెర్చ్‌ సెంటర్‌ (డీఏఆర్‌సీ)ని ఏర్పాటు చేయనుంది. ఇందులో యువతకు ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌ ప్రవేశపెట్టనుంది. ఇందులో అప్రెంటిస్‌గా చేరిన విద్యార్థులు ఎమ్మెల్యేలతో కలసి పనిచేయాల్సి ఉంటుంది. ఇందువల్ల యువతకు శాసనసభ కార్యకలాపాల నిర్వహణపై అవగాహన కలుగుతుంది. అంతేకాకుండా వీరు శాసనసభ్యులకు ఆయా రోజుల్లో చర్చించే అంశాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇందువల్ల ఎమ్మెల్యేలకు తాజా సమాచారం అందుతుంది. తత్ఫలితంగా వారికి కూడా ఆయా అంశాల విషయంలో నిష్ణాతులుగా మారుతారు.

ఇలా ఇరువైపులా ప్రయోజకనకరమైన ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం త్వరలో కార్యరూపంలోకి తీసుకురానుంది. అసెంబ్లీ సచివాలయం ఈ డీఏఆర్సీని ఏర్పాటు చేస్తుంది. 50 మందికి ఫెలోషిప్‌తోపాటు మరో 90 మందికి అసిస్టెంట్‌ ఫెలోషిప్‌ ఇవ్వనుంది. ఈ ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌ ఏడాది కాలానికి ఇస్తారు. ఎవరైనా పూర్తిస్థాయిలో నేర్చుకోలేదని అనిపిస్తే మరో ఏడాదికాలం పొడిగిస్తారు. అధికార పార్టీ ఎమ్మెల్యే సోమ్‌నాథ్‌ భారతి ఏడాదిన్నర క్రితం ఈ అంశాన్ని సభ ముందుంచారు. తమకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసేందుకు తగినంత వ్యవధి దొరకకపోతుండడంతో సోమ్‌నాథ్‌ ఈ ఆలోచనను సీఎం ముందుంచారు. ఎమ్మెల్యే సోమ్‌నాథ్‌ భారతి చేసిన ఈ ప్రతిపాదనను పరిశీలించే బాధ్యతను స్పీకర్‌ రాంనివాస్‌ గొయల్‌ అప్పట్లో జనరల్‌ పర్పస్‌ కమిటీ (జీపీసీ)కి అప్పగించారు.

ఏడాదిలోగా తనకు నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించారు. ఔత్సాహికులు ఈ నెల 25వ తేదీలోగా డీఏఆర్‌సీ.డీటీయూ.ఏసీ.ఇన్‌’కు పంపాల్సి ఉంటుంది. డీఏఆర్‌సీలో విలువైన, నాణ్యతా ప్రమాణాలతో కూడిన అధ్యయనం జరుగుతుందని, ఇది శాసనసభ్యులకు ఉపయుక్తంగా ఉంటుందని, వారికి అవసరమైన సమాచారం అందేందుకు దోహదం చేస్తుందని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో శాసనసభ సచివాలయం పేర్కొంది. ఎంపిౖకైన యువకులు...శాసనసభ్యులు, అసెంబ్లీ సెక్రటరియేట్, ఆయా ప్రభుత్వ విభాగాలతో చక్కని సమన్వయంతో కలసిమెలసి పనిచేయాలని ఢిల్లీ ప్రభుత్వం కోరింది.  
 

మరిన్ని వార్తలు