విమానాలకు పక్షుల బెడద!

10 Mar, 2016 18:48 IST|Sakshi

భువనేశ్వర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పక్షుల బెడద వీడటంలేదు. ఎప్పుడు ఏ పక్షి ఢీ కొడుతుందో తెలియక అధికారులు ఆందోళన చెందుతున్నారు.  తాజాగా గురువారం ఉదయం ఢిల్లీకి బయల్దేరిన  గో ఎయిర్ విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. అయితే అదృష్టం కొద్దీ ప్రమాదం తృటిలో తప్పింది. దీంతో విమానంలోని వందమంది వరకు ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు.

వందమంది ప్రయాణీకులతో బయల్దేరిన ఢిల్లీ-భువనేశ్వర్ గో ఎయిర్ ఫ్లైట్ కు తృటిలో ప్రమాదం తప్పినట్లు అధికారులు వెల్లడించారు. సిబ్బందితోపాటు ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారని, ఎటువంటి ఆస్తి నష్టం  జరగలేదని బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (బిపిఐఏ) అధికారి వెల్లడించారు.

పక్షి ఢీకొట్టిన తర్వాత విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశామని, అనంతరం విమాన ప్రధాన భాగంలో పక్షి అవశేషాలతోపాటు రక్తం మరకలను కనుగొన్నామని తెలిపారు. దీంతో భువనేశ్వర్ నుంచి బయల్దేరాల్సిన G8-162 గో ఎయిర్ విమానం 50 నిమిషాలు ఆలస్యం అయినట్లు తెలిపారు. అధికారులు పూర్తిశాతం తనిఖీలు నిర్వహించిన అనంతరం చివరకు ఉదయం 9.20 నిమిషాలకు టేకాఫ్ అయినట్లు గో ఎయిర్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

అంతర్జాతీయ విమానాశ్రయంలో పక్షులు ఢీకొట్టడం కొత్తేమీ కాదని, 2011 లో సుమారు 19, 2012 లో 18 పక్షులు ఢీకొన్నాయని, అలాగే 2013, 2014 రెండు సంవత్సరాల్లో పది చొప్పున పక్షులు విమానాలనుఢీకొన్నట్లు బీపీఐఏ అధికారులు తెలిపారు. 2015 సంవత్సరంలో నవంబర్ 6 నాటికి 11 పక్షులు విమానాలను ఢీకొట్టినట్లు నివేదికలు తెలుపుతున్నాయన్నారు.  అయితే ఈ పక్షుల బెడద నివారించేందుకు భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ సహా బీపీఐఏ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు