ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్‌ సెంటర్‌ విశేషాలు

29 Jun, 2020 13:44 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీలు కరోనాకు హాట్‌స్పాట్స్‌గా మారాయి. జూలై చివరినాటికి ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 5.5లక్షలకు చేరుకుంటాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా రోగులకు చికిత్స చేయడం కోసం ప్రపంచంలోనే అతి పెద్ద తాత్కాలిక కోవిడ్‌ ఆసుపత్రిని దక్షిణ ఢిల్లీలో నిర్మించారు. ఈ ఆస్పత్రి వివరాలు.. చత్తర్‌పూర్‌లోని ఆధ్యాత్మిక క్షేత్రం రాధాస్వామి సత్సంగ్‌ బియాస్‌ కాంప్లెక్స్‌నే ఈ తాత్కాలిక కరోనా ఆస్పత్రిగా మార్చారు. 15 ఫుట్‌బాల్‌ మైదానాలతో సమానమైన ఈ ప్రత్యేక ఆస్పత్రికి ‘సర్దార్‌ పటేల్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ అండ్‌ హాస్పిటల్‌’ అని పేరు పెట్టారు. దీనిలో 10,000 పడకల సామర్థ్యం ఉంది. చైనాలో 10 రోజుల్లో నిర్మించిన కోవిడ్‌ ప్రత్యేక ఆసుపత్రి కన్నా ఇది పదింతలు పెద్దది కావడం విశేషం. (సెల్ఫ్‌ ఐసోలేషన్‌‌లో ఉంటానని చెప్పి..)

ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్(ఐటీబీపీ)‌ విభాగానికి చెందిన వైద్య సిబ్బంది ఈ ఆసుపత్రిలో పనిచేస్తారు. దాదాపు 1000 మంది జనరల్‌ డాక్టర్లతో పాటు ఇతర సిబ్బంది ఇక్కడ సేవలు అందించనున్నారు. మొత్తం బెడ్స్‌ని 10 విభాగాలుగా విభజిస్తారు. వీటిలో 1000 పడకలకు ఆక్సిజన్‌ పాయింట్లు అమర్చుతారు. రోగుల కోసం 5 వేల ఫ్యాన్‌లు, 1000 మూత్రశాలలు ఏర్పాటు చేశారు. లక్షణాలు కనిపించని కరోనా పాజిటివ్‌ రోగులకు.. తక్కువ లక్షణాలు ఉన్న వారికి ఇక్కడ చికిత్స అందిస్తారు. అయితే ఈ ఆస్పత్రిలో తొలుత 2,000 పడకలు అందుబాటులోకి రానుండగా.. జూలై 3 వరకు పూర్తి స్థాయిలో బెడ్స్‌ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ఢిల్లీ కార్పొరేషన్‌ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఐటీబీపీ దేశంలో తొలిసారి కరోనా పేషంట్ల కోసం జనవరిలో నైరుతి ఢిల్లీలోని చావ్లాలో 1,000 పడకల కేంద్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. (స్మైల్‌ ప్లీజ్‌‌.. కరోనాతో క్లోజ్‌..!)

ఇదేకాక డీఆర్‌డీఓ మరో 1,000 పడకల ఎయిర్ కండిషన్డ్ ఆస్పత్రిని సిద్ధం చేస్తోంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో దీన్ని ఏర్పాటు చేస్తోంది. దీనిలో మొత్తం నాలుగు విభాగాలు ఉండగా ఒక్కొక్క దానిలో 250 పడకలు ఉంటాయి. వాటిలో ఒక విభాగంలో ఆక్సిజన్, ఐసీయూ సౌకర్యాలు ఉంటాయి.

మరిన్ని వార్తలు