ఆక్సిజన్‌ సిలండర్లు ఉంటేనే.. బతుకుతాం!

30 Dec, 2017 18:50 IST|Sakshi

ఢిల్లీలో ఇక తిరగాలంటే ఆక్సిజన్‌ సిలండర్లు ఉండాల్సిందేనా? ప్రతి వ్యక్తి రోజూ 5 సిలండర్లు దగ్గర పెట్టుకోవాల్సిందేనా? అంటే అవునని నిపుణులు చెబుతున్నారు. ఆ రోజులు ఉంతో దూరంలో లేవని కూడా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ వాసులకు అత్యంత తీవ్ర స్థాయిలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది. చర్యలు తీసుకున్న సమయంలో కాలుష్యం తగ్గినట్లు కనిపించినా.. వెంటనే మళ్లీ వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలంటే.. ఆక్సిజన్‌ సిలండర్లు.. వెంట పెట్టుకోవాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయో రోజుల్లో ప్రతి వ్యక్తి కనీసం రోజుకు 5 సిలండర్లు వెంట పెట్టుకోవాల్సిందేనని నిపుణులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం అనేక రోగాలకు కారణంగా మారుతోంది. ప్రధానంగా.. నెలల నిండకుండానే పిల్లలు పుట్టడం, హృదయ, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, అలర్జీలు, క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక రోగాలకు కారణమవుతోంది.  

ఢిల్లీ ఎయిర్‌ డాట్‌ ఓఆర్‌జీ వెబ్‌ సైట్‌ ప్రకారం.. ఢిల్లీ, రాజధాని పరిసర ప్రాంతాల్లో వాయుకాలుష్యం భీకరంగా జరుగుతోంది. మానవ కార్యకలాపాలు, వాహనాలు వెదజల్లే కార్బన్‌డయాక్సైడ్‌,  నిర్మాణ పనులు, పరిశ్రమలు,  గృహ అవసరాల కోసం ఇంధన ఉపయోగం వంటికి ఇందుకు ప్రధాన కారణాలు. ఢిల్లీ మున్సిపాలిటీ ప్రతిరోజూ 10 వేల టన్నుల చెత్తను సేకరిస్తోంది. కాలుష్యానికి ఇదీ ఒక కారణమే. 

ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్‌ ఆధారిత రవాణ వ్యవస్థను (ఎలక్ట్రిక్‌ బస్‌ తరహావంటివి) అభివృద్ధి చేయాలని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనుమిత రాయ్‌ చౌదరి సూచించారు. అంతేకాక 2018లోపు భద్రాపూర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని శాశ్వతంగా మూసివేయాలని ఆయన చెప్పారు. 

మరిన్ని వార్తలు