ముఖ్యమంత్రుల మాటల యుద్ధం

9 Nov, 2017 13:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీని ఆవరించిన పొగమంచు, వాతావరణ కాలుష్యం ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధానికి కారణంగా నిలిచింది. ఢిల్లీ వాతావరణ కాలుష్యంపై  సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరేందర్‌ సింగ్‌, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో చర్చించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విటర్‌ వేదికగా కేజ్రీవాల్‌, అమరేందర్‌ సింగ్‌ పరస్పరం వాగ్బాణాలు సంధించుకున్నారు.

పంజాబ్‌లో పంటలను తగలబెట్టడం వల్ల ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది, దాన్ని తక్షణం నిలుపుచేయండి.. అంటూ ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, అమరేందర్‌ సింగ్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. ఢిల్లీ పరిస్థితులకు ఒకరకంగా మీరే కారణం అంటూ కేజ్రీవాల్‌ మాటల దాడి చేశారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి ఆవేదనను నేను అర్థం చేసుకోగలను.. కానీ పరిస్థితులు నా చేతులు దాటి వెళ్లిపోయాయి. కాలుష్య నివారణకు జాతీయ స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిందే.. అంటూ పంజాబ్‌ సీఎం అమరేందర్‌ సింగ్‌ ట్వీట్ ద్వారానే సమాధానం చెప్పారు.

మరిన్ని వార్తలు