చిదంబరంను విచారించనున్న ఈడీ

21 Nov, 2019 15:55 IST|Sakshi

న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం తీహార్‌ జైళ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిదంబరాన్ని నవంబర్‌ 22,23 వ తేదిలలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతినిచ్చింది. కాగా,ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో పి చిదంబరాన్ని విచారించాలని కోరుతూ ఈడీ గురువారం రోజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది.  మనీ లాండరింగ్‌ కేసులో ఢిల్లీ హైకోర్టు తన బెయిల్‌ రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, మరోపక్క నవంబర్‌ 15న జస్టిస్‌ సురేశ్‌ కైట్ ఇచ్చిన తీర్పులో లోపాలున్నాయంటూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

ఈ మేరకు ఈడీ చేసిన దరఖాస్తులో నవంబర్ 15న జస్టిస్ కైట్ ఇచ్చిన తీర్పులో 2017లో సుప్రీంకోర్టు జారీ చేసిన నాలుగు పేరాగ్రాఫ్‌ల సారాంశాన్ని చదివి మనీలాండరింగ్ కేసులో ఢిల్లీకి చెందిన న్యాయవాది రోహిత్ టాండన్‌తో పాటు చిదంబరానికి బెయిల్ తిరస్కరించారు. దీనిని పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు చిదంబరాన్ని విచారించేందుకు ఈడీని అనుమతిస్తున్నట్లు తెలిపింది.అయితే డీమోనిటైజేషన్ సంబంధిత మనీలాండరింగ్ కేసులో 2016లో రోహిత్‌ టాండన్‌ను అరెస్టు చేశారు. 2007లో కేంద్ర ఆర్ధిక మంత్రిగా ఉండగా ఐఎన్ఎక్స్ మీడియా గ్రూపు రూ. 305 కోట్ల విదేశీ నిధులను అందుకునేందుకు తన శాఖలోని ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా ఆయన అనుమతి ఇప్పించారన్న ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ 16న ఈడీ ఆయనను అరెస్టు చేసింది. అంతకు ముందే  2017 మే 15 న సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
(చదవండి : చిదంబరం బెయిల్‌: ఈడీకి సుప్రీం నోటీసులు)


 

మరిన్ని వార్తలు