చార్జిషీటు లీకేజీపై విచారణ

7 Apr, 2019 04:36 IST|Sakshi

అగస్టాపై కోర్టుకెక్కిన ఈడీ, మిషెల్‌

న్యూఢిల్లీ: రూ.3,600 కోట్ల అగస్టావెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణం చార్జిషీటు వివరాలు బయటకు వెల్లడి కావడంపై దర్యాప్తు చేయించాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), ఈ కేసులో అరెస్టయిన మధ్యవర్తి క్రిస్టియన్‌ మిషెల్‌ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా, చార్జిషీటులోని వివరాలను ఎలా సంపాదించారో తెలపాలంటూ సదరు వార్తా సంస్థను ఆదేశించాలని ఈడీ.. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయాలని చూస్తున్న ఈడీపై విచారణ జరపాలంటూ క్రిస్టియన్‌ మిషెల్‌ పిటిషన్‌లు వేశారు. ‘కోర్టుకు సమర్పించిన సప్లిమెంటరీ చార్జిషీటు ప్రతులను ఈ కేసులోని నిందితులకు మేం ఇంకా ఇవ్వనేలేదు. అయినా అందులో ఏముందో మిషెల్‌ లాయర్లకు తెలిసింది.

ఆ ప్రకారమే వారు పిటిషన్‌ వేశారు. దీనిని చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలి. చార్జిషీటు వివరాలు వెల్లడిపై దర్యాప్తు జరగాలి’ అని ఈడీ వాదించింది. తమ క్లయింట్‌కు చార్జిషీటు కాపీని ఇవ్వకమునుపే ఈడీ మీడియాకు లీక్‌ చేసిందని మిషెల్‌ లాయర్‌  ఆరోపించారు. కోర్టు ప్రత్యేక జడ్జి ఈ వ్యవహారంపై 11న విచారిస్తామన్నారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు సప్లిమెంటరీ చార్జిషీటు ప్రతిని సీల్డు కవర్‌లో భద్రపరచాలని ఈడీని ఆదేశించారు. హెలికాప్టర్ల కొనుగోలు కోసం అప్పటి కేంద్రప్రభుత్వం, అగస్టావెస్ట్‌ల్యాండ్‌ల మధ్య 2010నాటి ఒప్పందం వల్ల ఖజానాకు రూ.2,666 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ గతంలో తెలిపింది. 

మరిన్ని వార్తలు