ఈడీ దర్యాప్తుపై స్టే కుదరదు..

26 Feb, 2019 03:24 IST|Sakshi
రాబర్ట్‌ వాద్రా

దర్యాప్తునకు హాజరుకావాలని వాద్రాకు ఢిల్లీ కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొం టున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బావ రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణపై స్టే విధించాలన్న వాద్రా పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. మంగళవారం జరగనున్న ఈడీ విచారణకు హాజరుకావాలని వాద్రాను ఆదేశించింది. ఇక గతేడాది వాద్రా ఆఫీసుల్లో నిర్వహించిన దాడుల్లో సేకరించిన డాక్యుమెంట్ల హార్డ్‌కాపీలను వాద్రాకు అందించాలని సీబీఐ ప్రత్యేక జడ్జి అరవింద్‌ కుమార్‌ ఈడీని ఆదేశించారు. తదుపరి విచారణను మార్చి 2కు వాయిదా వేశారు. గతేడాది డిసెంబర్‌ 7న ఢిల్లీలో ఉన్న వాద్రా ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించిన ఈడీ పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. వీటి ఆధారంగా ప్రస్తుతం తనను విచారిస్తోందని.. ఈ డాక్యుమెంట్ల కాపీలను తనకు అందించాలని కోరుతూ వాద్రా కోర్టును ఆశ్ర యించారు. డాక్యుమెం ట్ల కాపీలు తనకు ఇచ్చేవరకు విచారణ ఆపేయాల్సిందిగా ఈడీని ఆదేశించాలని వాద్రా తన పిటిషన్‌లో కోరారు.

తొందరేముంది.. వస్తా
ప్రస్తుతం తనపై ఉన్న కేసులన్నీ పూర్తయిన తర్వాత రాజకీయాల్లోకి వస్తానని వాద్రా అన్నారు. సోమవారం ఆయన ఈ మేరకు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. వాద్రా రాజకీయాల్లోకి వస్తున్నారని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘రాజకీయాల్లోకి వస్తా. ప్రజా సేవ చేస్తా. తొందరేముంది. తొలుత నాపై ఉన్న నిరాధార ఆరోపణలన్నీ తొలగిపోవాల్సి ఉంది. అలాగే నేను మార్పు తీసుకురాగలనని ప్రజలు కూడా నమ్మాలి’ అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు