డీకే శివకుమార్‌కు 10రోజుల కస్టడీ

4 Sep, 2019 20:11 IST|Sakshi

బెంగళూరు : మనీ లాండరింగ్‌ కేసులో నిన్న సాయంత్రం అరెస్టయిన కర్ణాటక మాజీ మంత్రి , కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ను 14 రోజులపాటు తమ కస్టడీకీ అప్పగించాలంటూ బుధవారం ఈడీ అధికారులు చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ ట్రయల్‌ కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి శివకుమార్‌ను10 రోజుల(సెప్టెంబర్‌ 13 వరకు) కస్టడీకి మాత్రమే అనుమతినిస్తూ ఈడీకి ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, నిన్న రాత్రి అరెస్టయినప్పటి నుంచి చాతీ నొప్పి వచ్చి, బీపీ, షుగర్‌ లెవల్స్‌ పడిపోవడంతో బెంగుళూరులోని ఆర్‌ఎల్‌ఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తవడంతో ఈడీ అధికారులు శివకుమార్‌ను అక్కడి నుంచి నేరుగా కోర్టుకు తరలించారు. 

కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌గా పేరు పొందిన డీకే శివకుమార్‌ మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి ఆగస్టు 30 నుంచి జరుగుతున్న విచారణ సెస్టెంబర్‌ 3తో ముగియడంతో అరెస్టు చేశారు. విచారణ సమయంలో ఆయన అంతగా సహకరించకపోవడంతో.. మరింత లోతుగా విచారించడానికే ఆయనను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు స్పష్టం చేశారు. 

కాగా, శివకుమార్‌ అరెస్టును నిరసిస్తూ బుధవారం కర్నాటక కాంగ్రెస్‌ నేతలు పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్‌ హింసాత్మకంగా మారింది. పలుచోట్ల ఆందోళనకారులు బస్సు అద్దాలను ద్వంసం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను, కళాశాలలను బలవంతంగా మూసివేయించారు. 

రాజకీయ కక్షసాధింపుకు ఇదే ఉదాహరణ : రాహుల్‌ 
డీకే శివకుమార్‌ అరెస్టు వ్యవహారంపై ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో స్పందించారు. ఈ అరెస్టు చర్య బీజేపీ రాజకీయకక్ష సాధింపు చర్యలకు ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. కావాలనే కొందరు వ్యక్తులను ఎంపిక చేసుకొని మరీ వారిపై సీబీఐ, ఈడీ వంటి సంస్థలను ఉపయోగిస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. 

>
మరిన్ని వార్తలు