నిర్భయ దోషులకు ఉరిశిక్ష వాయిదా

31 Jan, 2020 17:44 IST|Sakshi

న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్షపై ఢిల్లీ పాటియాలా హౌజ్‌ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు దోషుల మరణ శిక్షను నిలుపుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కాగా నిర్భయ దోషులకు ఫిబ్రవరి ఒకటో తేదీన ఉరిశిక్ష అమలు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే దోషులకు చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకునేందుకు వీలుగా శిక్ష అమలును వాయిదా వేయాలన్న నిర్భయ దోషుల పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీహార్‌ జైలు అధికారులకు నోటీసులు పంపింది. ఇక ఇదే కేసులో దోషి అక్షయ్‌ వేసిన క్యూరేటివ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.  అదే విధంగా కేసులో మరో దోషి అయిన పవన్‌ గుప్తా ఘటన జరిగే నాటికి తాను మైనర్‌ అంటూ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను శుక్రవారం కొట్టివేసింది.(నిర్భయ కేసు: పవన్‌ గుప్తాకు సుప్రీంకోర్టు షాక్‌)

కాగా కాగా ఏడేళ్ల క్రితం ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఓ యువతిపై ఆరుగురు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడి దారుణంగా హింసించగా.. సింగపూర్‌లో చికిత్స పొందుతూ ఆమె మరణించిన విషయం విదితమే. ఈ కేసులో ప్రధాన దోషి రామ్‌ సింగ్‌ జైలులో ఆత్మహత్య చేసుకోగా.. ఘటన నాటికి మైనర్‌గా ఉన్న మరో నిందితుడు విడుదలయ్యాడు. మిగిలిన నలుగురు దోషులు ముఖేష్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్తా (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ ఠాకూర్‌ (31)లకు దాదాపు రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు మరణ శిక్ష విధించింది. ఈ క్రమంలో జనవరి 22 ఉదయం 7 గంటలకు తీహార్‌ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌజ్‌ కోర్టు డెత్‌ వారెంట్లు జారీ చేసినప్పటికీ... వినయ్‌ శర్మ, ముఖేష్‌ కుమార్‌ సర్వోన్నత న్యాయస్థానంలో క్యూరేటివ్‌ పిటిషన్లు దాఖలు చేయడం.. ముఖేష్‌ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరిన నేపథ్యంలో.. నిబంధనలను అనుసరించి ఫిబ్రవరి 1న ఉరితీసేందుకు రంగం సిద్ధమైంది.

ఈ క్రమంలో వినయ్‌ శర్మ రాష్ట్రపతి క్షమాభిక్ష కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశాడు. అదే విధంగా అక్షయ్‌ కుమార్‌ ఉరిశిక్షపై స్టే విధించాలంటూ కోర్టును ఆశ్రయించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో పటియాలా హౌజ్‌ కోర్టు ఆదేశాలతో మరోమారు ఉరిశిక్ష వాయిదా పడింది. వీటన్నింటిపై విచారణ జరిగిన తర్వాత కోర్టు మరోసారి డెత్‌ వారెంట్లు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. కోర్టు తాజా ఆదేశాలు రాకమునుపు.. దోషులను ఉరి తీసేందుకు తలారి తీహార్‌ జైలుకు చేరుకున్నాడు. బస్తాలతో డమ్మీ ట్రయల్స్‌ కూడా నిర్వహించారు.

నిర్భయ దోషుల వివరాలు
ముఖేష్‌ సింగ్‌: తీహార్‌ జైల్లో ఉరి వేసుకొని చనిపోయిన బస్సు డ్రైవర్‌ రామ్‌ సింగ్‌ తమ్ముడే ముఖేష్‌  సింగ్‌ (32). దక్షిణ ఢిల్లీలోని రవిదాస్‌ మురికివాడల్లో సోదరుడితో కలసి నివసించేవాడు అప్పుడప్పుడు తానే ఆ బస్సుని నడిపించేవాడు. క్లీనర్‌గా చేసేవాడు.  ఘటన రోజు ముఖేశ్‌ బస్సు నడిపాడు. అత్యాచారం చేశాక నిర్భయ, ఆమె స్నేహితుడిని ఐరన్‌ రాడ్‌తో చితకబాదాడని ముఖేష్‌పై అభియోగాలు నమోదయ్యాయి.

వినయ్‌ శర్మ: వినయ్‌శర్మ (26) కూడా రవిదాస్‌ మురికివాడల్లో నివసించే వాడు. అతను ఫిటినెస్‌ ట్రైనర్‌. ఒక జిమ్‌లో అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. ప్రాథమిక విద్య అభ్యసించాడు.

అక్షయ్‌ కుమార్‌ ఠాకూర్‌: అక్షయ్‌ ఠాకూర్‌ (31) బిహార్‌ వాసి. నిర్భయను అత్యాచారం చేసిన బస్సులో హెల్పర్‌గా ఉన్నాడు. స్కూల్‌ డ్రాపవుట్‌ అయిన అక్షయ్‌ 2011లో బిహార్‌ నుంచి ఢిల్లీకి వచ్చాడు. నేరం చేయడమే కాదు సాక్ష్యాధారాల్ని కూడా నాశనం చేయడానికి ప్రయత్నించాడు. నేరం జరిగిన ఐదు రోజుల తర్వాత అక్షయ్‌ని బిహార్‌లో అరెస్ట్‌ చేశారు.

పవన్‌ గుప్తా: పవన్‌ గుప్తా (25) పండ్ల వ్యాపారి. డిసెంబర్‌ 16 మధ్యాహ్నం మద్యం సేవించి బయటకు వెళ్లాడు. అరెస్ట్‌ చేసిన తర్వాత పవన్‌ తాను చాలా దుర్మార్గానికి పాల్పడ్డానని, తనకి ఉరి శిక్షే సరైనదని కోర్టులో చెప్పుకున్నాడు.

మరిన్ని వార్తలు