జామా మసీద్‌ పాక్‌లో ఉందా..?

14 Jan, 2020 15:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జామా మసీద్‌లో నిరసన తెలిపిన భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా ఢిల్లీ కోర్టు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిరసన తెలపడం పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కని, పార్లమెంట్‌లో చెప్పాల్సిన విషయాలు చెప్పనందుకే ప్రజలు వీధుల్లోకి వచ్చారని స్పష్టం చేసింది. చంద్రశేఖర్‌ ఆజాద్‌పై మోపిన ఆరోపణలను ప్రస్తావిస్తూ జామా మసీద్‌ పాకిస్తాన్‌లో ఉన్నట్టు మీరు ప్రవర్తిస్తున్నారని, గతంలో పాకిస్తాన్‌ అవిభక్త భారత్‌లో అంతర్భాగమైనందున మీరు అక్కడికి వెళ్లైనా నిరసన తెలుపవచ్చని ఢిల్లీ పోలీసుల తీరును తప్పుపట్టారు. ఆజాద్‌ సోషల్‌ మీడియా పోస్ట్‌లను ప్రాసిక్యూటర్‌ ప్రస్తావిస్తూ హింసను ప్రేరేపించేలా ఆయన పోస్ట్‌లున్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

జామా మసీద్‌ వద్ద ధర్నా చేస్తున‍్నట్టు సోషల్‌ మీడియాలో ఆజాద్‌ పోస్ట్‌ చేశారని ప్రాసిక్యూటర్‌ చెబుతుండగా ధర్నా చేస్తే తప్పేముందని, నిరసన తెలపడం పౌరుల రాజ్యాంగ హక్కని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ పోస్టుల్లో తప్పేముందని, హింస ఎక్కడ చెలరేగిందని..మీరసలు రాజ్యాంగాన్ని చదివారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సెక్షన్‌ 144 అమల్లో ఉన్నందున ముందస్తు అనుమతి అవసరమని ప్రాసిక్యూటర్‌ వాదిస్తుండగా ఏం అనుమతి కావాలని అంటూ పదేపదే సెక్షన్‌ 144 విధించడం వేధింపుల కిందకు వస్తుందని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసిందని చెప్పారు. ఆజాద్‌ హింసను ప్రేరేపించారనేందుకు ఆధారాలు చూపాలని న్యాయమూర్తి కోరగా ఇందుకు తమకు తగినంత సమయం ఇవ్వాలని ప్రాసిక్యూటర్‌ కోరగా విచారణ బుధవారానికి వాయిదా పడింది.

మరిన్ని వార్తలు