అధికారులకు షాకిచ్చిన పోస్ట్మార్టం నివేదిక

15 Dec, 2015 16:32 IST|Sakshi
అధికారులకు షాకిచ్చిన పోస్ట్మార్టం నివేదిక

న్యూఢిల్లీ:  ఢిల్లీలోని  షాకూర్ బస్తీ అక్రమ గుడిసెల తొలగింపు వ్యవహారంలో  రైల్వే, రెవెన్యూ శాఖ అధికారులకు చుక్కెదురైంది. ఢిల్లీ సంజయగాంధీ ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన  పోస్ట్మార్టం నివేదిక అధికారులకు,  ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది.  తీవ్ర గాయాల వల్లే చిన్నారి మరణించిందని పోస్ట్మార్టం నివేదిక తేల్చి చెప్పింది. దీంతో కూల్చివేతలకు, చిన్నారి మరణానికి  సంబంధం లేదని ప్రకటించిన మంత్రివర్యులు, రైల్వేశాఖ అధికారులు ఇరకాటంలో పడ్డారు.

షాకూర్ బస్తీ కూల్చివేతల్లో మరణించిన చిన్నారి మృతదేహానికి మంగళవారం  పోస్ట్మార్టం పూర్తయింది.  సంజయ్ గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ నిపుణుల వైద్య బృందం తన నివేదికను సమర్పించింది. చిన్నారి తలకు బలమైన గాయమైందని అలాగే రెండు నుండి నాలుగు పక్కటెముకలు విరిగిపోయాయని తెలిపింది.  తీవ్ర రక్తస్రావం జరిగినట్టుగా తమ పరీక్షలో తేలిందని,  పాప చనిపోయి సుమారు 30 గంటలు అవుతుందని తన నివేదికలో  పేర్కొంది.  ఛాతీ, తలపైన తీవ్ర గాయాలు, రక్తస్రావం, షాక్ వల్ల పాప చనిపోయివుండవచ్చని  అభిప్రాయపడింది.

మరోవైపు ఈ ఘటనపై  ఢిల్లీ హైకోర్టు కూడా  సీరియస్గా స్పందించింది. గడ్డకట్టుకు కుపోయే చలిలో పేదల  ఆవాసాలను కూల్చడం అన్యాయమని న్యాయస్థానం ఆక్షేపించింది. ఈ వ్యవహారంలో అధికారులందరూ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది.  జాతీయ మావనహక్కులు సంఘం ఢిల్లీ ప్రభుత్వానికి, రైల్వే బోర్టుకు నోటీసులు జారీ చేసింది.


కాగా ఢిల్లీలో ప్రతిపాదిత రైల్వే టెర్మినల్ నిర్మాణ ప్రాంతంలో గత శనివారం అర్థరాత్రి అక్రమ గుడిసెల తొలగింపు వ్యవహారం, చిన్నారి మరణం ఒక్కసారిగా ఉద్రిక్తతను రేకెత్తించిన విషయం తెలిసిందే.
 

>
మరిన్ని వార్తలు