ఆప్‌ విజయంలో ‘బిర్యానీ’ పాత్ర

11 Feb, 2020 14:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగా అరవింద్‌ కేజ్రివాల్‌ నాయకత్వంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఘన విజయం సాధించింది. ఈ విజయంలో మసాలా దినుసులతో ఘుమ ఘుమలాడే ‘బిర్యానీ’ కూడా తనవంతు పాత్రను నిర్వహించిందని చెప్పవచ్చు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘బిర్యానీ’ ఓ రాజకీయ ఆయుధంగా మారడమే అందుకు కారణం.

సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌ బాద్‌లో ఆందోళన చేస్తున్న వారికి ఆప్‌ ప్రభుత్వం ‘బిర్యానీ’ సరఫరా చేస్తోందని బీజేపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా పదే పదే ఆరోపణలు చేసింది. ఆ పార్టీ ఐటీ విభాగం హెడ్‌ అమిత్‌ మాలవియా అయితే ‘షహీన్‌ బాద్‌లో బిర్యానీ పంచుతున్నారనడానికి ఇదిగో ప్రూఫ్, అదిగో ప్రూఫ్‌’ అంటూ ఏవో ఫొటోలతో ట్వీట్లపై ట్వీట్లు చేశారు. ఇలా ‘బిర్యానీ’ని ప్రతికూల ప్రచారానికి ఉపయోగించుకోవడం ఇదే మొదటి సారి కాదు.

2015లో ముంబై టెర్రరిస్టు దాడుల కేసు విచారణ సందర్భంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఉజ్వల్‌ నికమ్‌ ‘బిర్యానీ’ ఆయుధంగా ఉపయోగించారు. జైల్లో టెర్రరిస్ట్‌ అజ్మల్‌ కసబ్‌కు జైలు అధికారులు ‘బిర్యానీ’ పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అప్పట్లో కసబ్‌కు పెరుగుతున్న మద్దతును దెబ్బతీయడానికే తాను ఆ అబద్ధపు ఆరోపణ చేశానని ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చుకున్నారు. దక్షిణాసియా ముస్లింలకు బహు పసందైన ‘బిర్యానీ’ని రాజకీయ ఆయుధంగా వాడినట్లయితే హిందువుల ఓట్లన్నీ కట్టకట్టుకొని తమకే పడతాయని బీజేపీ నేతలు ఆశించారు. అయితే ఆ నినాదాన్ని ఎవరు అంతగా పట్టించుకోలేదని ఎన్నికల ఫలితాలే సూచిస్తున్నాయి.

నిమిషానికి 95 వేల ఆడర్లు
భారత్‌లో ప్రతి నిమిషానికి 95 బిర్యానీల ఆర్డర్‌ వస్తోందని ఇంటికి ఆహారాన్ని సరఫరా చేస్తున్న అతి పెద్ద యాప్‌ ‘స్విగ్గీ’ లెక్కలు తెలియజేస్తున్నాయి. దేశంలో జాతీయ ఆహారంగా ‘బిర్యానీ’ని గుర్తించాలనే స్థాయికి దీని ప్రాధాన్యత పెరిగింది. భారత దేశ ఆహారాన్ని రుచి చూడాలనుకునే విదేశీయులు మొట్టమొదగా బిర్యానీ, ఆ తర్వాత బటర్‌ చికెన్‌ను శోధిస్తారని ‘ఎస్‌ఈఎం రష్‌’ 2019లో నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది.

ధోని హోటల్‌ మారిన వైనం
భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఆయన బస చేసిన హోటల్‌లోకి బయటి నుంచి బిర్యానీని అనుమతించకపోతే ఆయన ఏకంగా హోటల్‌ నుంచే మకాం మార్చారు. పర్షియన్‌ పదం బిర్యాన్‌ నుంచి బిర్యానీ వచ్చింది. పర్షియన్‌లో బిరింజ్‌ అంటే బియ్యం అని అర్థం కూడా ఉంది. బిర్యానీ మొఘల్స్‌ వంటకమని, వారి నుంచి ఇది భారత్‌కు వచ్చిందని చెబుతారు. తుర్క్‌–మంగోల్‌ చక్రవర్తి తైమార్‌ 14వ శతాబ్దంలోనే ఈ వంటకాన్ని భారత్‌కు తీసుకొచ్చారనే వాదన కూడా ఉంది. నిజాం నవాబులు, లక్నో నవాబులు ఈ వంటకాన్ని అమితంగా ప్రేమించి ప్రాచుర్యంలోకి తెచ్చారు.

పలు రకాల బిర్యానీలు
హైదరాబాద్‌ దమ్‌ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. సంప్రదాయ మొఘలాయ్‌ బిర్యానీ కూడా హైదరాబాద్‌లో దొరకుతుంది. అలాగే బెంగళూరు బిర్యానీ, కోల్‌కతా బిర్యానీ, ముంబై బిర్యానీ, లక్నో బిర్యానీ (పుక్కీ బిర్యానీ, అవద్‌) అంటూ ఏ ప్రాంతం బిర్యానీలకు ఆ ప్రాంతం ప్రత్యేకతలుండగా హైదరాబ్‌ దమ్, మొఘలాయ్, థలస్సరీ బిర్యానీలు దేశవ్యాప్తంగా పెద్ద నగరాల్లో దొరకుతున్నాయి. బిర్యానీ అంటే ప్రధానంగా మటన్‌తో చేసేదని, ఇప్పుడు చికెన్, ఎగ్, ఫిష్, ప్రాన్స్‌లతోపాటు విజిటెబుల్‌ బిర్యానీలు కూడా దొరకుతున్న విషయం తెల్సిందే. (హస్తిన తీర్పు : లైవ్‌ అప్‌డేట్స్‌

చదవండి : ఆప్‌ జోరు, వైరల్‌ మినీ మఫ్లర్‌మ్యాన్‌

మరిన్ని వార్తలు