షీలా దీక్షిత్‌ కన్నుమూత

21 Jul, 2019 04:17 IST|Sakshi
షీలా పార్థివదేహం వద్ద నివాళులర్పిస్తున్న ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీ

గుండెపోటుతో మృతిచెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత

ఢిల్లీ సీఎంగా వరుసగా మూడుసార్లు పనిచేసిన ఘనత

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురి సంతాపం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, సుదీర్ఘ కాలం ఢిల్లీ సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్‌(81) గుండెపోటుతో కన్నుమూశారు. ఢిల్లీలోని ఫోర్టిస్‌ ఎస్కార్ట్స్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శనివారం మధ్యాహ్నం ఆమె తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు. షీలా మృతికి రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. షీలా భౌతిక కాయాన్ని ఈస్ట్‌ నిజాముద్దీన్‌ ప్రాంతంలో ఉన్న ఆమె నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. అంత్యక్రియలు నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఢిల్లీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. షీలా దీక్షిత్‌ శనివారం ఉదయం తీవ్ర గుండెపోటుకు గురి కావడంతో కుటుంబసభ్యులు వెంటనే ఫోర్టిస్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించారు. ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ అశోక్‌ సేథ్‌ నేతృత్వంలోని వైద్య బృందం ఆమెకు అత్యాధునిక వైద్య చికిత్స అందించింది. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి తాత్కాలికంగా కుదుటపడింది. కొద్ది సేపటి తర్వాత మరోసారి గుండెపోటు రావడంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ప్రముఖుల సంతాపం
ఢిల్లీ సీఎంగా షీలా నగర రూపురేఖలనే మార్చేశారని, ఆమె ప్రజల మదిలో కలకాలం గుర్తుండిపోతారని రాష్ట్రపతి కోవింద్‌ తన సంతాపం సందేశంలో పేర్కొన్నారు. షీలా మంచి పరిపాలనాదక్షురాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య పేర్కొన్నారు. ఢిల్లీ అభివృద్ధిలో షీలా సేవలు శ్లాఘనీయమని ప్రధాని మోదీ అన్నారు. అనంతరం మోదీ షీలా నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించారు. షీలా మరణ వార్త తనను షాక్‌కు గురిచేసిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. షీలా దీక్షిత్‌ను ఆయన..అత్యంత ఆత్మీయురాలు, కాంగ్రెస్‌ పార్టీ అభిమాన పుత్రికగా పేర్కొన్నారు. అంకితభావం కలిగిన ప్రజా నేతలను కాంగ్రెస్‌ కోల్పోయిందని మాజీ ప్రధాని మన్మోహన్‌ తన సందేశంలో పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు ఆమె మరణం తీరని నష్టమని, ఆమె సేవలను ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారని సీఎం కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. షీలా దీక్షిత్‌ కుమార్తె, కుమారుడికి యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ రాసిన లేఖను కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా ట్విట్టర్‌లో ఉంచారు. ‘మీ తల్లికి నా హృదయంలో గొప్ప స్థానముంది. నా భర్త రాజీవ్‌తో షీలాజీకి మంచి అనుబంధం ఉండేది. ఈ క్రమంలో ఆమెతో నాకూ స్నేహం ఏర్పడింది. షీలాజీకి ఉన్న అనేక సుగుణాలను నేను అభిమానించడం ప్రారంభించాను. ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రిగా, డీపీసీసీ చీఫ్‌గా, ఇందిరాగాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా ఉన్నకాలంలో ఎలాంటి అరమరికలు లేకుండా కలిసి పనిచేశాం’ అని సోనియా పేర్కొన్నారు.

సమర్ధురాలైన పాలకురాలు: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: సీనియర్‌ రాజకీయవేత్త, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విషాదంలో మునిగి ఉన్న ఆమె కుటుంబీకులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు. ఆమె మరణంతో దేశం ఒక సమర్థురాలైన పాలకురాలిని కోల్పోయిందని జగన్‌ తన సందేశంలో పేర్కొన్నారు. షీలా దీక్షిత్‌ పోరాట పటిమకు, సాహసానికి, చురుకుదనానికి పెట్టింది పేరని జగన్‌ కొనియాడారు.

షీలా చివరి ఆదేశాలు
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పర్యటనలో ప్రతిష్టంభన తొలగని పరిస్థితుల్లో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద శనివారం ఆందోళనకు దిగాలని పార్టీ కార్యకర్తలను షీలా దీక్షిత్‌ కోరినట్లు తెలుస్తోంది. యూపీలో పర్యటిస్తున్న ప్రియాంకను అక్కడి బీజేపీ ప్రభుత్వం నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. శనివారం కూడా ఆమె నిర్బంధం కొనసాగినట్లయితే బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన తెలపాల్సిందిగా ఢిల్లీ కాంగ్రెస్‌ చీఫ్‌ హోదాలో షీలా దీక్షిత్‌ కార్యకర్తలకు శుక్రవారం ఆదేశాలిచ్చినట్లు సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. అవసరమైతే ఆదివారం కూడా నిరసన కొనసాగించాలని కూడా ఆమె చిట్టచివరి ఆదేశాలు జారీ చేశారని పార్టీ నేత కిరణ్‌ వాలియా వివరించారు.

>
మరిన్ని వార్తలు