సిక్కిం మ‌రో దేశం : అధికారి స‌స్పెండ్‌

24 May, 2020 13:15 IST|Sakshi

ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌పై విప‌క్షాల మండిపాటు

ప్ర‌క‌ట‌న‌ను ఉప‌సంహ‌రించుకున్న ఢిల్లీ ప్ర‌భుత్వం

న్యూ ఢిల్లీ: ఢిల్లీ ప్ర‌భుత్వం త‌ప్పులో కాలేస్తూ జారీ చేసిన ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న తీవ్ర దుమారం రేపింది. ఇందులో సిక్కింను ప్ర‌త్యేక దేశంగా ప‌రిగణించ‌డంతో ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి తీవ్ర అసంతృప్తిని వెల్ల‌గ‌క్కారు. దీంతో చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా ఢిల్లీ ప్ర‌భుత్వం హుటాహుటిన త‌ప్పును స‌రిదిద్దుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. ఢిల్లీ రాష్ట్ర ప్ర‌భుత్వం సివిల్ డిఫెన్స్ కార్పొరేష‌న్‌లో వాలంటీర్లుగా చేరాల‌నుకునేవారి కోసం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ప‌లు ప‌త్రిక‌ల్లోనూ ఈ యాడ్‌ అచ్చ‌యింది. అందులో భూటాన్‌, నేపాల్ దేశాల స‌ర‌సన సిక్కింను కూడా చేర్చింది. దేశంలో అంత‌ర్భాగ‌మైన సిక్కింను ప్ర‌త్యేక దేశంగా ప‌రిగ‌ణించ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెలువెత్తాయి. (ఈ రోడ్డు చాలా ‘హైట్‌’ గురూ...)

కేజ్రీవాల్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి
ఇదే అద‌నుగా భావించిన బీజేపీ.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్‌)పై తీవ్రంగా మండిప‌డింది. ఈశాన్య‌ ప్రాంతాల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసిన అర్వింద్‌ కేజ్రీవాల్ వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ప‌ట్టుబ‌ట్టింది.  దీనిపై స్పందించిన ఆప్.. హోం మంత్రిత్వ‌శాఖ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగానే ఈ ప్ర‌క‌ట‌న జారీ చేశామ‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. మ‌రోవైపు ఈ ప్ర‌క‌ట‌న‌ సిక్కిం ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దెబ్బ తీస్తున్నాయ‌ని, వెంట‌నే దాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప్రేమ్‌సింగ్‌ తమాంగ్ ఢిల్లీ ప్ర‌భుత్వాన్ని కోరారు. దీంతో ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర్వింద్ కేజ్రీవాల్ స‌ద‌రు ప్ర‌క‌ట‌న‌ను ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు తెలిపారు. ఈ దారుణ త‌ప్పుకు కార‌ణ‌మైన సంబంధిత అధికారిని విధుల నుంచి తొలగించిన‌ట్లు వెల్ల‌డించారు. కాగా సిక్కిం ప్ర‌త్యేక రాష్ట్రంగా 1975 మే 16న అవ‌త‌రించింది. వారం రోజుల కింద‌టే రాష్ట్ర అవ‌త‌ర‌ణ వేడుక‌లు జ‌రుపుకుంది. (క్రమశిక్షణతో కొమ్ములు వంచారు)

మరిన్ని వార్తలు