ఢిల్లీలో సరి–బేసి వాయిదా

12 Nov, 2017 01:29 IST|Sakshi

ఎన్జీటీ అభ్యంతరం నేపథ్యంలో ఆప్‌ సర్కారు నిర్ణయం

మినహాయింపులపై మండిపడ్డ జాతీయ హరిత ట్రిబ్యునల్‌

ప్రమాద స్థాయిలోనే కాలుష్యం

న్యూఢిల్లీ: కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్న దేశ రాజధానిలో సోమవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న ‘సరి–బేసి’ విధానాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. మహిళలు, ద్విచక్ర వాహనాలకు ఈ విధానం నుంచి మినహాయింపు ఇవ్వటంపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్‌ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మహిళల భద్రతపై రాజీపడబోమన్న కేజ్రీ సర్కారు.. సోమవారం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు స్పష్టం చేసింది.

ప్రభుత్వ మినహాయింపులకు ఎన్జీటీ అంగీకరించిన తర్వాత ‘సరి–బేసి’ని తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ రవాణా మంత్రి కైలాశ్‌ గెహ్లాట్‌ వెల్లడించారు. ‘మహిళల భద్రతపై రాజీపడబోం. పీఎం 2.5, పీఎం 10 అనే కాలుష్య స్థాయిలూ కాస్తంత తగ్గాయి. కానీ ఎన్జీటీ నిర్ణయాలను గౌరవిస్తున్నాం. అయితే, సోమవారం మళ్లీ ఎన్జీటీలో రివ్యూ పిటిషన్‌ వేస్తాం’ అని గెహ్లాట్‌ పేర్కొన్నారు. ఎన్జీటీ ఆదేశాల తర్వాత సీఎం కేజ్రీవాల్, పలువురు మంత్రులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అత్యవసర సర్వీసులు ఓకే.. కానీ!
ఢిల్లీని కాలుష్యం కమ్మేసిన నేపథ్యంలో నవంబర్‌ 13 నుంచి 17 వరకు ఐదురోజుల పాటు సరి–బేసి విధానాన్ని అమలుచేయాలని తొలుత కేజ్రీవాల్‌ ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్రమైన స్మాగ్‌ (పొగమంచు+కాలుష్యం) కారణంగా పాఠశాలలకు కూడా ఆదివారం వరకు సెలవులిచ్చింది. దీంతో సోమవారం నుంచి స్కూలు బస్సులు, ఇతర వాహనాలతో మళ్లీ కాలుష్యం పెరగొచ్చని భావించిన ప్రభుత్వం ఈ విధానాన్ని అమలుచేసేందుకు రంగం సిద్ధం చేసింది.

అయితే ఇందులో మహిళల వాహనాలు, ద్విచక్ర వాహనాలతోపాటుగా అంబులెన్సు, చెత్త తీసుకెళ్లే వాహనాలు, అగ్నిమాపక యంత్రాలకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఈ మినహాయింపులపై ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలైంది. అంబులెన్సు, చెత్త వాహనాలు, ఫైరింజన్లకు మినహాయింపును సమర్థించిన ఎన్జీటీ.. మహిళలు, ద్విచక్ర వాహనాలకు అనుమతినివ్వాలన్న ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఢిల్లీ సర్కారు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. చలికాలంలో వాహనాల ద్వారానే పెద్దమొత్తంలో పీఎం2.5, పీఎం10లు మామూలు సమయం కన్నా 20–25 శాతం ఎక్కువగా వెలువడతాయని ఐఐటీ కాన్పూర్‌ గతంలో ఓ అధ్యయనంలో వెల్లడించింది.

ఢిల్లీ ట్రాన్స్‌పోర్టుపై ఎన్జీటీ ఆగ్రహం
ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ బస్సులను సరిగా నిర్వహించటం లేదని.. దీని కారణంగా ఈ బస్సులు పెద్ద శబ్దం చేస్తూ ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని ఎన్జీటీ మండిపడింది. ‘మీ బస్సులు రోడ్లపై పెద్ద శబ్దం చేస్తూ ఇబ్బందికరంగా మారుతున్నాయి. చాలావరకు బస్సుల్లో కనీసం హ్యాంగర్లు ఉండవు. బస్సులను నిర్వహించటంలో బాధ్యతగా వ్యవహరించరెందుకు?. కొన్ని సార్లు ఖాళీగా వెళ్తున్నాయి. మరికొన్ని సార్లు రద్దీగా ఉంటున్నాయి’ అని ఎన్జీటీ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ స్వతంతర్‌ కుమార్‌ మండిపడ్డారు. తక్కువ ట్రాఫిక్‌ ఉన్న సమయాల్లో మినీ బస్సులు నడపాలని గతంలో ఎన్జీటీ సూచించింది. వీటిని పట్టించుకోకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రమాదకర స్థాయిలోనే కాలుష్యం
దేశరాజధానిలో గాలిలో విషపదార్థాలు, కాలుష్యకారకాల స్థాయి ఇంకా ప్రమాదకరస్థితిలోనే ఉంది. వరుసగా ఐదోరోజూ అదే స్థాయిలో పొల్యూషన్‌ కనిపించింది. కాస్త కుదురుకుంటుందనుకున్న తరుణంలో.. శనివారం సాయంత్రం పరిస్థితుల్లో మార్పు నగరాన్ని ‘కాలుష్య అత్యవసర’ దిశగా తీసుకెళ్లింది. పీఎం 2.5, పీఎం 10 స్థాయిలు మెల్లిగా తగ్గుముఖం పడుతున్నాయని ప్రభుత్వం ప్రకటించిన కాసేపటికే.. పరిస్థితి భిన్నంగా మారింది. వేగంగా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల ఏర్పడటమే ఇందుకు కారణమని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) అధికారులు తెలిపారు.

దీనివల్ల అనారోగ్య పరిస్థితులు తీవ్రమవుతాయని హెచ్చరించారు. సీపీసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం మధ్యాహ్నం వాయు నాణ్యత సూచీ 423 (మొత్తం 500) యూనిట్లుగా నమోదవగా.. పీఎం2.5 స్థాయి 422కు చేరుకుంది. ఢిల్లీ–ఎన్సీఆర్‌ పరిధిలో యూపీలోని ఘజియాబాద్‌ అత్యంత కాలుష్య ప్రదేశంగా నిలిచింది. ఇక్కడ వాయు నాణ్యత సూచీ 484 యూనిట్లుండగా.. పీఎం 2.5 స్థాయి 869 యూనిట్లకు చేరింది. సాధారణ స్థాయికన్నా ఇది 34 రెట్లు ఎక్కువ.

మరిన్ని వార్తలు