లాక్‌డౌన్‌: అక్కడ మరికొన్ని సడలింపులు

28 Apr, 2020 12:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ రెండో విడత మే 3న ముగియనున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర సేవల నిమిత్తం కొన్ని రంగాలకు నిబంధనలు సడలించింది. పాథలాజికల్‌ ల్యాబ్‌లు, బుక్‌స్టోర్లు తెరవడం సహా వైద్య సిబ్బంది అంతరాష్ట్ర ప్రయాణాలకు అనుమతినిచ్చింది. ఈ మేరకు ఏప్రిల్‌ 27న ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ(డీడీఎంఏ) ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కొనసాగింపు అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన విషయం తెలిసిందే.(ఆ తర్వాత కూడా ఇవి నిషేధమే..!)

ఈ నేపథ్యంలో ఒకేసారి దేశవ్యాప్తంగా కాకుండా, రెడ్‌ జోన్లలో లాక్‌డౌన్‌ను కొనసాగించాలని, మిగతాచోట్ల లాక్‌డౌన్‌ నిబంధనలకు చాలావరకు మినహాయింపు ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మంగళవారం నాటికి భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 29,435కి చేరగా.. ఇప్పటివరకు 6,869 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మృతుల సంఖ్య 934గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా ఢిల్లీలో ఇప్పటి వరకు 54 కరోనా మరణాలు సంభవించగా.. 3100 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.(గుడ్‌న్యూస్‌.. మరికొన్ని ఆంక్షలు సడలింపు)

ఢిల్లీలో లాక్‌డౌన్‌ సడలింపు ఇలా..
1. హెల్త్‌కేర్‌
వెటర్నరీ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, క్లినిక్‌లు, పాథలాజికల్‌ లాబొరేటరీస్‌, వ్యాక్సిన్‌, మందుల అమ్మకాలు, సరఫరా

2. ప్రయాణాలు
శాస్త్రవేత్తలు, వైద్య సిబ్బంది అంతరాష్ట్ర ప్రయాణాలకు అనుమతి. అత్యవసర పరిస్థితుల్లో విమాన ప్రయాణాలు చేయవచ్చు.

3. షెల్టర్‌ హోమ్‌లు
దివ్యాంగులు, మానసిక వైకల్యంతో బాధ పడుతున్న వారు, చిన్న పిల్లలు, వితంతు, మహిళా శరణాలయాలు, వృద్ధాశ్రమాలు

4. ఎలక్ట్రిషీయన్లు, ప్లంబర్లు, వాటర్‌ ఫ్యూరిఫైయర్లు బాగు చేసే వారు తదితర స్వయం ఉపాధి పొందే పౌరులకు అనుమతి

5. ఎలక్ట్రిక్‌ ఫ్యాన్ల షాపులు, బుక్‌స్టోర్లు తెరిచేందుకు అనుమతి
 

>
మరిన్ని వార్తలు