వివాదాస్పద ఉత్తర్వులపై వెనక్కి తగ్గిన ఢిల్లీ గవర్నర్‌

20 Jun, 2020 19:21 IST|Sakshi

న్యూఢిల్లీ: క‌రోనా సోకిన వారిని హోం క్వారంటైన్‌కి త‌ర‌లించే ముందు త‌ప్ప‌నిస‌రిగా అయిదు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఐసోలేష‌న్ వార్డులో ఉంచాల‌ంటూ జారీ చేసిన ఉత్తర్వులను ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ అనిల్ బైజ‌ల్ ఉపసంహరించుకున్నారు. శుక్రవారం గవర్నర్‌ జారీ చేసిన ఈ ఉ‍త్తర్వుల పట్ల కేజ్రీవాల్‌ ప్రభుత్వం తీవ్రంగా నిరసన తెలిపింది. గవర్నర్‌ ఉత్తర్వుల ప్రకారం కరోనా పేషంట్లను ఐసోలేషన్‌ వార్డులోనే ఉంచితే.. ఈ నెల చివర వరకు దాదాపు 90 వేల బెడ్లు అవసరమవుతాయని కేజ్రీవాల్‌ ప్రభుత్వం పేర్కొన్నది. ఇప్పటికే బెడ్ల కొరతతో ఇబ్బంది పడుతుండగా.. మరో 90 వేల పడకలు ఎలా ఏర్పాటు చేస్తామని ప్రశ్నించింది. (‘అలా చేస్తే మరో 90వేల బెడ్లు కావాలి’)
 

ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. కేవలం ఢిల్లీకి మాత్రమే ఈ ప్రత్యేక గైడ్‌లైన్స్‌ ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈ ఉత్తర్వులు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్‌ఆర్) మార్గదర్శకాలకు విరుద్ధమన్నారు. కరోనా లక్షణాలు లేనివారు.. తక్కువగా ఉన్న వారు ఇంట్లోనే హోం క్వారంటైన్‌లో ఉండాలని ఐసీఎమ్‌ఆర్‌ సూచించదని మనీష్‌ సిసోడియా గుర్తు చేశారు. ప్రస్తుతం గవర్నర్‌ జారీ చేసిన ఉత్తర్వులు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. (కరోనా చికిత్స: మార్కెట్లోకి ఫబిఫ్లూ ఔషదం)

మరిన్ని వార్తలు