బస్సులకు, మెట్రోకు కామన్‌ కార్డు

8 Jan, 2018 16:15 IST|Sakshi

న్యూఢిల్లీ : నగర రవాణా వ్యవస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణా కోసం వాడే బస్సులకు, మెట్రోకు కామన్‌ మొబిలిటీ కార్డును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ లాంచ్‌ చేశారు. దీంతో కామన్‌ మొబిలిటీ కార్డును లాంచ్‌ చేసిన తొలి నగరంగా ఢిల్లీ పేరులోకి వచ్చింది. మెట్రో రైళ్లతో పాటు, 200 డీటీసీ, 50 క్లస్టర్‌ బస్సులకు ఈ కార్డును వాడుకోవచ్చని లాంచింగ్‌ సందర్భంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ చెప్పారు. రవాణా వ్యవస్థలో తాము తీసుకున్న ఈ నిర్ణయం చాలా కీలకమైనదని, ఢిల్లీ ప్రజలకు అనంతమైన ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్డు లాంచింగ్‌ సందర్భంగా ముఖ్యమంత్రి కొంచెం సేపు డీటీసీ బస్సులో ప్రయాణించారు.

డెబిట్‌ కార్డు లాగానే ఈ కామన్‌ కార్డు పనిచేస్తుందని, ఏప్రిల్‌ 1 నుంచి డీటీసీ, క్లస్టర్‌ బస్సుల్లో దీన్ని వాడుకోవచ్చని చెప్పారు. నగరవ్యాప్తంగా మొత్తం 3900 డీటీసీ, 1600కి పైగా క్లస్టర్‌ బస్సులు ఉన్నాయి. షీలా దీక్షిత్‌ ప్రభుత్వంలోనే ఈ కార్డును తొలిసారి ప్రతిపాదనలోకి వచ్చిందని, కానీ దీన్ని ప్రారంభించడం ఆలస్యం చేశారని కేజ్రీవాల్‌ అన్నారు. ఎందుకు ఆలస్యం చేశారో మాజీ సీఎం షీలా దీక్షిత్‌ను అడగండంటూ సూచించారు. ఏదేమైనప్పటికీ, తమ ప్రభుత్వం ఈ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. దీంతో ఢిల్లీ ప్రజలకు ప్రయాణం సులభతరం అవుతుందని చెప్పారు. ఢిల్లీ మెట్రో ఛార్జీలు పెంచిన నేపథ్యంలో దీనికి కౌంటర్‌గా కామన్‌ మొబిలిటీ కార్డును కేజ్రీవాల్‌ తీసుకొచ్చారు.  ఈ పైలెట్‌ ప్రాజెక్ట్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి కైలాస్‌ గెహ్లోత్‌ కూడా ఉన్నారు. 
 

మరిన్ని వార్తలు