ఢిల్లీ అల్లర్లు : రాహుల్‌, ప్రియాంకలపై పిటిషన్‌

28 Feb, 2020 14:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : డిల్లీ అల్లర్లకు సంబంధించి విపక్ష నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీలపై చర్యలు చేపట్టాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్‌లపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. ఈ పిటిషన్‌ల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం,ఢిల్లీ ప్రభుత్వంతో పాటు ఢిల్లీ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఏఏ వ్యతిరేక నిరసనల వెనుక ఎవరున్నారో నిగ్గుతేల్చేందుకు దర్యాప్తు చేపట్టాలని కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌పైనా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హరిగౌతమ్‌ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌, జస్టిస్‌ సి హరిశంకర్‌లతో కూడిన హైకోర్టు బెంచ్‌ ఢిల్లీ ప్రభుత్వం, హోంమంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది.

ఇక సామాజిక కార్యకర్తలు హర్ష్‌ మందర్‌, ఆర్జే సయేనా, నటి స్వర భాస్కర్‌లు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని, వారిపై చర్యలు చేపట్టాలని కోరుతూ సంజీవ్‌ కుమార్‌ మరో పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు సోనియా, రాహుల్‌, ప్రియాంక, ఓవైసీ సోదరులు, వారిస్‌ పఠాన్‌, మనీష్‌ సిసోడియా, అమనతుల్లా ఖాన్‌, మహ్మద్‌ ప్రచాలు ద్వేషపూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆరోపిస్తూ బీజేపీ లీగల్‌ సెల్‌ సభ్యులు పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు కేంద్రం, ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను ఏప్రిల్‌ 30కి వాయిదా వేసింది.

చదవండి : ఢిల్లీ పోలీసులపై మాలివాల్‌ అసంతృప్తి

మరిన్ని వార్తలు