హిమాచల్‌ సీఎం, జస్టిస్‌ కర్ణన్‌కు చుక్కెదురు

3 Jul, 2017 11:27 IST|Sakshi

న్యూఢిల్లీ: హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌కు మరోసారి న్యాయస్థానంలో చుక్కెదురు అయింది. మనీ లాండరింగ్‌ కేసును కొట్టేయాలన్న ఆయన అభ్యర్థనను ఢిల్లీ కోర్టు సోమవారం తిరస్కరించింది. కాగా మనీ లాండరింగ్‌ కేసులో వీరభద్రసింగ్‌తో పాటు ఆయన కుటుంబంపై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. యూపీఏ–2 ప్రభుత్వంలో ఉక్కు శాఖ మంత్రిగా వీరభద్రసింగ్‌ పనిచేశారు. ఆ సమయంలో 2009 నుంచి 2011 మధ్య ఆయన, కుటుంబ సభ్యులు కలిసి రూ.10 కోట్ల దాకా అక్రమాస్తులు కూడబెట్టారని సీబీఐ 2015 సెప్టెంబర్‌లో కేసు నమోదు చేసింది.

జస్టిస్‌ కర్ణన్‌ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ
మరోవైపు కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కర్ణన్‌కు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. కోర్టు ధిక్కర నేరానికిగానూ విధించిన ఆరు నెలల జైలు శిక్షను రద్దు చేయాలని దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. కాగా  కర్ణన్‌కు సుప్రీంకోర్టు ఆరు నెలలు జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. తీర్పు వెలువడిన అదేరోజు చెన్నైకు చేరుకున్న కర్ణన్‌ ఆ తర్వాత అరెస్టు, జైలు శిక్షను తప్పించుకునేందుకు కనిపించకుండాపోయారు.

దీంతో కర్ణన్‌ అరెస్టు కోసం కోల్‌కతా పోలీసులు తమిళనాడులో గాలింపు తీవ్రం చేశారు. ఎట్టకేలకు గతనెలలో అరెస్ట్‌ చేశారు. 1983లో తమిళనాడులో న్యాయవాదిగా వృత్తిజీవితం ప్రారంభించిన ఆయన 2009లో మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 మార్చి 11న కోల్‌కతా హైకోర్టుకు బదిలీఅయ్యారు.

మరిన్ని వార్తలు