యూపీఎస్సీపై పిల్‌కూ తిరస్కృతి

23 Aug, 2014 02:10 IST|Sakshi

రేపే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష
 
 న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష రెండో పేపర్‌లో ఇంగ్లిష్ కాంప్రహెన్సివ్ విభాగం ప్రశ్నలను అభ్యర్థులు వదిలివేయవచ్చన్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్ణయంపై దాఖలైన పిల్‌ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. సివిల్స్ పరీక్షకు హాజరవుతున్న నగ్వాన్ అనే న్యాయవాది ఈ పిల్‌ను దాఖలు చే శారు. అయితే వ్యక్తిగత కారణంపై కోర్టుకు వచ్చారని, ఇది ప్రజాప్రయోజనవ్యాజ్యం ఎలా అవుతుందం టూ కోర్టు ప్రశ్నించింది.

ఇంతకుముందు ఇలాంటి పిటిషన్‌నే వేరే ధర్మాసనం ముందు దాఖలు చేశారని పేర్కొంటూ అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ వ్యతిరేకించటంతో ఈ అంశంపై క్యాట్‌ను ఆశ్రయించాలని కోర్టు సూచించింది. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరగనుంది. కొత్త విధానం ప్రకారం ప్రిలిమ్స్ రెండో పేపర్(సీశాట్-2)లో ఆంగ్ల భాషా పరిజ్ఞానానికి సంబంధించిన మార్కులను మెరిట్ జాబితాకు పరిగణనలోకి తీసుకోరని కేంద్రం తెలిపింది.

దృష్టిలోపం ఉన్నవారికి అదనపు సమయం

సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరవుతున్న దృష్టిలోపం గల అభ్యర్థులకు ప్రతి పేపర్‌కు 40 నిమిషాల చొప్పున అదనపు సమయం ఇవ్వనున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. దృష్టి లోపం ఉన్న అభ్యర్థులకు ఇది వర్తిస్తుందని తెలిపింది.

సివిల్స్-2011 అభ్యర్థులకు మరో చాన్స్...

2011లో సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు వచ్చే ఏడాది అదనపు అవకాశం ఇవ్వనున్నట్లు శుక్రవారం కేంద్రం వెల్లడించింది.
 

>
మరిన్ని వార్తలు