ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రకు ప్లాస్మా థెరఫీ

20 Jun, 2020 13:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ బారినపడిన ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌కు ప్లాస్మా థెరఫీ చికిత్స అందిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని మాక్స్‌ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉంచి ఆయనకు వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కాగా ఈనెల 17న సత్యేంద్ర జైన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిపడుతున్న ఆయన్ని తొలుత ఢిల్లీలోని రాజీవ్‌ గాంధీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందించారు. అయితే శుక్రవారం సాయంత్రం ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు గుర్తించడంలో మాక్స్‌ ఆస్పత్రికి తరలించారు. (ఆక్సిజన్‌ సపోర్ట్‌పై ఆరోగ్య శాఖ మంత్రి)

జైన్‌ ప్రస్తుతం  ఆస్పత్రిలో ఉన్న నేపథ్యంలో ఆయన బాధ్యతలను డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాకు అప్పగిస్తూ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇక జైన్‌ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసుకున్నారు. తగిన చికిత్సను అందించాలని వైద్యులను కోరారు. అలాగే కరోనా నుంచి జైన్‌ వెంటనే కోలుకోవాలని  అమిత్‌ షా ఆకాంక్షించారు. (రాహుల్‌-అమిత్‌ షా మధ్య ట్విటర్‌ వార్‌)

మరిన్ని వార్తలు