ఉరిశిక్షలు వేస్తే అత్యాచారాలు ఆగుతాయా?

24 Apr, 2018 09:32 IST|Sakshi
ఇటీవల దేశంలో సంచలనంరేపిన అత్యాచార, హత్యల ఉదంతాలు.

కేంద్ర ‘ఆర్డినెన్స్‌’పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

పోర్న్‌ సైట్లను నిషేధించండి: బీజేపీ మంత్రి

న్యూఢిల్లీ: బాలికలపై అత్యాచారానికి పాల్పడే కీచకులకు మరణదండన విధించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌(పోక్సో చట్టంలో సవరణ)పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవున్నాయి. పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కేంద్ర నిర్ణయాన్ని బాహాటంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఉరిశిక్షలు వేస్తే అత్యాచారాలు ఆగుతాయా? ఆర్డినెన్స్‌ జారీ చేయడానికి ముందు కేంద్రం శాస్త్రీయ అధ్యయనం చేసిందా? అత్యాచారానికి, హత్యకు శిక్ష ఒకటే అయినప్పుడు.. రేప్‌ చేసిన నిందితుడు బాధితురాలిని బతకనిస్తాడా?’’ అని జస్టిస్‌ గీతా మిట్టల్‌, జస్టిస్‌ హరిశంకర్‌లతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘అత్యాచార ఉదంతాలకు సంబంధించి గతంలో చేసిన ఐపీసీ చట్టసవరణ దుర్వినియోగం అవుతోందం’టూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

నిర్భయ చట్టం తర్వాత ఏంజరిగింది?: కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై అకృత్యం, ఉన్నావ్‌లో మైనర్‌ బాలికపై అత్యాచారం, బాధితురాలి తండ్రి హత్య ఘటనలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికిన దరిమిలా కేంద్రం పోక్సో చట్టానికి సవరణలు చేసింది. 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం జరిపితే ఖచ్చితంగా మరణశిక్ష విధించాలన్నది ఆ సవరణ ఉద్దేశం. కాగా, గతంలో నిర్భయ ఉదంతం తర్వాత కూడా ఇదే మాదిరిగా కఠిన చట్టాలను రూపొందించడం, వాటి వల్ల నేరాలు అదుపులోకి రానివిషయాన్ని సామాజిక, న్యాయ నిపుణులు గుర్తుచేస్తున్నారు. నిర్భయ చట్టం తర్వాత లైంగిక నేరాలు అదుపులోకొస్తాయని జాతి యావత్తూ విశ్వసించినా, వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరిగింది. 2016 నాటి జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం మహిళలపై అత్యాచారాలు, ఇతర లైంగిక నేరాలు అంతక్రితం కంటే 2.9 శాతం పెరిగాయి. బాలికలపై లైంగిక నేరాలు సైతం గణనీయంగా పెరిగినట్టు ఆ నివేదిక తెల్పింది. 2015తో పోలిస్తే 2016లో ఈ తరహా నేరాలు 82 శాతం ఎక్కువయ్యాయని వివరించింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడుల్లో ఈ కేసులు అత్యధికంగా జరిగాయని పేర్కొంది. మెట్రో నగరాల్లో ఈ బెడద ఎక్కువని తెలిపింది. మరోపక్క పోక్సో కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలున్నా అవి నత్తనడకన సాగుతున్నాయని తేల్చింది.

పోర్న్‌ సైట్లను నిషేధించండి: బీజేపీ మంత్రి
దేశంలో లైంగికనేరాల పెరుగుదలకు పోర్న్‌ వెబ్‌సైట్లే ప్రధాన కారణమని మధ్యప్రదేశ్‌ హోం మంత్రి భూపేంద్ర సింగ్‌ అన్నారు. యువతపై అశ్లీల సైట్ల ప్రభావం అధికంగా ఉందని, కాబట్టి వెంటనే వాటిపై పూర్తిస్థాయిలో నిషేధం విధించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖరాశారు.
(చదవండి: కఠిన చట్టాలే పరిష్కారమా?)

Poll
Loading...
మరిన్ని వార్తలు