మీరంతా శిక్ష అనుభవించాల్సిందే

29 Nov, 2018 04:21 IST|Sakshi

1984 అల్లర్ల దోషుల పిటిషన్‌ కొట్టివేత

ఢిల్లీ హైకోర్టు తీర్పు

న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి శిక్షలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. 1996లో ట్రయల్‌ కోర్టు విధించిన ప్రకారం దోషులంతా శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది. 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీలోని త్రిలోక్‌పురి ప్రాంతంలో జరిగిన అల్లర్లలో 95 మంది ప్రాణాలు కోల్పోగా 100 వరకు ఇళ్లు కాలిపోయాయి. ఈ ఘటనలపై విచారణ చేపట్టిన ట్రయల్‌ కోర్టు 89 మందికి జైలుశిక్షలు విధించింది. అయితే, కొందరు చనిపోగా సుమారు 70 మంది ఆ శిక్షలు రద్దు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

ఆ పిటిషన్‌ను బుధవారం జస్టిస్‌ ఆర్‌కే గౌబా విచారించారు. దోషుల వినతిని తోసిపుచ్చిన ఆయన.. అల్లర్లు, దోపిడీలు, గృహ దహనాలకు పాల్పడిన దోషులంతా 1996 కోర్టు తీర్పు ప్రకారం ఐదేళ్ల జైలు శిక్షను అనుభవించాల్సిందేనంటూ తీర్పు వెలువరించారు. ‘1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను అదుపు చేయటంలో అధికార యంత్రాంగం విఫలమైంది. ఇలాంటి ఘటనలను నివారించడానికి చట్ట సంస్కరణల అవసరం ఉంది. యంత్రాంగం సకాలంలో స్పందించకపోవడంతో అల్లర్లు వ్యాప్తి చెందాయి. చట్టపర విధానాల్లో జాప్యం వల్ల ఇలాంటి కేసులు ఏళ్లుగా కోర్టుల్లోనే ఉంటున్నాయి. దీంతో చట్టాలు అసమర్ధంగా, అసంతృప్తికరంగా మారాయి’ అని జస్టిస్‌ ఆర్‌కే గౌబా వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు