‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’కు ఊరట

7 Jan, 2019 16:14 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ చిత్రానికి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ చిత్ర ట్రైలర్‌ను నిషేధించాలంటూ వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఢిల్లీకి చెందిన పూజా మహాజన్‌ అనే ఫ్యాషన్‌ డిజైనర్‌ ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ ట్రైలర్‌ను నిషేధించాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందం సెక్షన్‌ 416ను ఉల్లంఘించిందని పూజ పిటిషన్‌లో పేర్కొంది.

సెక్షన్‌ 416 ప్రకారం ఒక వ్యక్తి జీవితాధారంగా సినిమా తీస్తున్నప్పుడు సంబంధిత వ్యక్తుల నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ తీసుకురావాలని పిటిషన్‌లో తెలిపింది. ఢిల్లీ హై కోర్టు సోమవారం ఈ పిటిషన్‌ని విచారించింది. ఈ సందర్భంగా పూజ తరఫు న్యాయవాది మైత్రి మాట్లాడుతూ.. ‘నిర్మాతలు.. మన్మోహన్‌ సింగ్‌ నుంచి కానీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నుంచి కానీ ఎలాంటి అనుమతి తీసుకోలేదు. కాబట్టి ట్రైలర్‌ను, సినిమాను నిషేధించండి’ అన్నారు.

ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి విభు భాక్రు పిటిషనర్‌ పూజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు, ఫ్యాషన్‌ డిజైనర్‌కు ఎలాంటి సంబంధంలేదని తేల్చారు. అసలు పిటిషన్‌ వేయడానికి సినిమాతో ఆమెకున్న సంబంధం ఏంటని ప్రశ్నించారు. ట్రైలర్‌ను నిషేధించడానికి వీల్లేందంటూ తీర్పునిచ్చారు.

యూపీఏ - 1 హయాంలో మన్మోహన్ సింగ్‌కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన వివాదాస్పద పుస్తకం.. 'ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ : ది మేకింగ్‌ అండ్‌ అన్‌మేకింగ్‌ ఆఫ్‌ మన్మోహన్‌సింగ్‌' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది.

మరిన్ని వార్తలు