తందూర్‌ హత్య కేసు; ఇంకా జైలులోనే ఉంచితే ఎలా?

21 Dec, 2018 18:48 IST|Sakshi

ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ : భార్యను అత్యంత పాశవికంగా హత్య చేసిన కేసులో  దాదాపు 20 ఏళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్న సుశీల్‌ శర్మ అనే వ్యక్తిని వెంటనే విడుదల చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తనను ముందస్తుగా విడుదల చేయాలంటూ సుశీల్‌ చేసిన అభ్యర్థనను ఎందుకు నిరాకరించారో చెప్పాలంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ క్రమంలో ‘ ఒక నేరంలో శిక్ష అనుభవించిన వ్యక్తిని ఇంకా జైలులోనే ఎలా ఉంచుతారు. ముందస్తుగా విడుదల చేయాలన్న అతడి అభ్యర్థనను శిక్షాకాల పునఃసమీక్ష బోర్డు(సెంటెన్స్‌ రివ్యూ బోర్డు- ఎస్సార్బీ) తోసిపుచ్చిన తీరు ఏకపక్షంగా ఉంది’  అని సిద్ధార్థ్‌ మృదుల్‌, సంగీత ధింగ్రా సెహగల్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఇప్పటికే శిక్ష అనుభవించిన సుశీల్‌ శర్మను తక్షణమే విడుదల చేయాలంటూ శుక్రవారం ఆదేశించింది.

కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్య కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న సుశీల్‌ శర్మ(తందూర్‌ హత్యకేసు), మను శర్మ(జెస్సికా లాల్‌ హత్యకేసు),  సంతోష్‌ సింగ్‌(ప్రియదర్శిని మట్టూ అనే యువతి హత్యకేసు)లు తమను ముందస్తుగా విడుదల చేయాలంటూ చేసిన అభ్యర్థనను ఢిల్లీ ప్రభుత్వం నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది అక్టోబరులో ఢిల్లీ హోం మంత్రి సత్యేంద్ర జైన్‌ అధ్యక్షతన సమావేశమైన శిక్షాకాల పునఃసమీక్ష బోర్డు... అత్యంత హేయమైన నేరాల్లో భాగమైన ఇలాంటి వ్యక్తులను ముందస్తుగా విడుదల చేయడం అంత శ్రేయస్కరం కాదని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు శుక్రవారం అతడిని విడుదల చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.

తందూర్‌ హత్యకేసు...
ఢిల్లీకి చెందిన సుశీల్‌ శర్మ 1995లో తన భార్య నైనా షాహ్నిని హత్య చేశాడు. మొదట ఆమెపై రెండుసార్లు కాల్పులు జరిపిన సుశీల్‌... ఆ తర్వాత శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి తందూర్‌(బాండీ)లో వేసి ఉడికించాడు. ఈ క్రమంలో తందూర్‌ హత్య కేసుగా నైనా హత్యకేసు ప్రాచుర్యం పొందింది. కాగా భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే సుశీల్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని.. ఈ కేసును విచారించిన పోలీసు అధికారి మాక్స్‌వెల్‌ పెరీరా తన పుస్తకంలో పేర్కొన్నారు. నైనాను హత్య చేసిన తర్వాత మొదట ఆమె శవాన్ని యమునా నదిలో పడేయాలని సుశీల్‌ భావించాడని... అయితే తన ఆలోచన విరమించుకుని స్నేహితుడు నడిపే రెస్టారెంట్‌లో ఉన్న తందూర్‌లో వేసి శవాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించాడని తెలిపారు.  

మరిన్ని వార్తలు