కుమారుడిని హత్య చేసినా.. ఇఫ్తార్‌ విందు

4 Jun, 2018 13:20 IST|Sakshi
ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న అంకిత్‌ సక్సేనా కుటుంబ సభ్యులు, ముస్లింలు(ఫొటో కర్టెసీ: హిందుస్థాన్‌ టైమ్స్‌)

సాక్షి, న్యూఢిల్లీ : కోపాలు, ద్వేషాలు మనుషుల మనస్తత్వాలకు చెందినవని, మంచి చేయమని మాత్రమే మతం చెబుతుందని మరోసారి రుజువైంది. ఢిల్లీకి చెందిన ఓ హిందువు ఆదివారం ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేసిన మత సామరస్యాన్ని చాటిచెప్పారు. ఇందులో పెద్ద విశేషమేముందని మీరు అనుకోవచ్చు.. కానీ తన ఒక్కగానొక్క కొడుకు మరణానికి కారణమైన మతస్తుల పట్ల తనకు ఎటువంటి కోపం లేదని, శాంతిని పెంపొందిచడమే తన లక్ష్యమని నిరూపించేందుకే ఆయన ఈ కార్యక్రమం చేపట్టారు.

ముస్లిం యువతిని ప్రేమించాడనే కారణంగా అంకిత్‌ సక్సేనా అనే 23 ఏళ్ల హిందూ యువకుడు నాలుగు నెలల క్రితం హత్యకు గురైన విషయం తెలిసిందే. అప్పట్లో సంచలనం సృష్టించిన అంకిత్‌ హత్య కేసును పరువు హత్యగా పోలీసులు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో అంకిత్‌ సక్సేనా తండ్రి యశ్‌పాల్‌ ఇఫ్తార్‌ విందు ఏర్ఫాటు చేయడం మంచి పరిణామమని పలువురు ప్రశంసిస్తున్నారు.

శాంతికి, సహనానికి చిహ్నంగా..
కుమారున్ని కోల్పోయిన దుఃఖంలో తనకు స్నేహితుడు మహమ్మద్‌ ఇజార్‌ ఆలం మాటలతో ఊరట కల్పించారని యశ్‌పాల్‌ వ్యాఖ్యానించారు. ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేయాలనే తన ఆలోచనను ఆలంతో పంచుకున్నపుడు ఆయన అన్ని విధాలుగా సాయం చేస్తానని హామీ ఇచ్చా రని తెలిపారు. ఆలంతో పాటు ఇరుగుపొరుగు వారు (హిందూ, ముస్లింలు) కూడా ఇఫ్తార్‌ విందు ఏర్పాట్లలో పాల్గొని శాంతికి, సహనానికి ప్రతీకగా నిలిచారన్నారన్నారు. అంకిత్‌ పేరిట చేపట్టిన ఈ కార్యక్రమానికి మాజీ ఐఏఎస్‌ అధికారి, సామాజిక కార్యకర్త హర్ష్‌ మందార్‌, గోరఖ్‌పూర్‌ డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ కూడా హాజరయ్యారు.

వారిని ఉరితీయాలి..
తన కుమారుడిని దారుణంగా హత్య చేసిన వారికి ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నట్లు యశ్‌పాల్‌ తెలిపారు. అంకిత్‌ను హత్య చేసిన వారిపైన మాత్రమే తన కోపం తప్ప వారి మతానికి చెందిన వారందరినీ ఒకేలా చూడడం, వారిపై కక్ష పెంచుకోవడం మూర్ఖమైన చర్యగా భావిస్తానన్నారు. తన కుమారుడు మరణించినప్పటికీ అతడి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా, శాంతిని పెంపొందించేలా మరిన్ని కార్యక్రమాలు చేపట్టడమే తన ముందున్న లక్ష్యమని యశ్‌పాల్‌ చెప్పారు.

ఇఫ్తార్‌ అంటే ఏమిటో తెలీదు..
యశ్‌పాల్‌ ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు హాజరైన పుష్పా ఓత్వాల్‌ అనే మహిళ అంకిత్‌ను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. అందరితో కలివిడిగా ఉండే అంకిత్‌ హత్యకు గురవడం తమను కలచివేసిందన్నారు. తన జీవితంలో ఇంతవరకు ఇఫ్తార్‌ విందుకు వెళ్లలేదని, కానీ యశ్‌పాల్‌ విందుకు రావాలంటూ పిలిచినపుడు ఇఫ్తార్‌ గురించి తనకు అర్థమయ్యేలా చెప్పారన్నారు.

మానవత్వానికి ఇదొక ఉదాహరణ..
‘మానవత్వం ఎంత ముఖ్యమో చెప్పే సంఘటన ఇది. మాలో చాలా మంది ఉపవాసం ఉండలేదు. కానీ అందరం కలిసి ఇలా విందులో పాల్గొనడం చక్కని సందేశాన్నిస్తుంది. సౌభ్రాతృత్వ భావనను పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని’ హర్ష్‌ మందార్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు